పుట:కాశీమజిలీకథలు -04.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఢిల్లీ పాదుషాగారి కథ

53

దొడంగితిరి. ఎన్ని పిల్చినను ఊఁ అనుటయైన లేదు. ఊపిరి మాత్రము విడుచుచుండిరి. పైయుపచారము లనేకములు గావించితిమి. ఏమియుఁ బ్రయోజనము లేక పోయినది. నాఁడుతుద నేఁటివఱకు నట్లేయుంటిరి. ఇప్పుడే మీ కంఠధ్వని వినంబడిన సంతోషముఁ జెందివచ్చితిమి. మేము లవంగి సఖురాండ్రము. ఇదిగో రాజపుత్రిక యీ ప్రక్కను నిలువంబడియున్నది. ఇన్ని దినములు నిద్రాహారములు మాని మీ నిమిత్తమే చింతించుచున్నదని తత్సమయోచితముగా వక్కాణించిరి.

అప్పుడాచక్రవర్తి మిగుల విస్మయముఁ జెందుచు ఆ-ఏమి యీ చిత్రము? నా శరీర మిక్కడనే యున్నదని మీరు చెప్పుచున్నారే. జరిగిన దంతయు స్వప్నము గాబోలు. అయ్యో? అప్పుడు సైతము నేనది స్వప్నమనుకొని కాదని నిశ్చయించుకొంటినే. మేలుమేలు. అట్టి విపరీతస్వప్నము లెప్పుడును జూచియెరుంగను. స్వప్నములో స్వప్నములు వచ్చిన సత్యమనుకొనుచుంటిని. ఇప్పుడిది నాకు స్వప్నమేమో ఏది నిశ్చయించుటకు వీలులేకున్నది. ఏమిచేయుదును. ఎట్లు సత్యమును తెలుసు కొందుని పెక్కు తెఱంగుల ధ్యానించి మఱల వారి కిట్లనియె.

పాదుషా - యువతులారా! మీ మాటలచే నే నిక్కడనే యున్నట్లు స్పష్టమగుచున్నది గదా!

సఖురాండ్రు — దేవరా! సందియమేల ఇక్కడనే యుంటిరి.

పాదుషా — నే నిన్నిదినంబు లొక్కగుహలోఁ గొందఱు పురుషులచే నాక చేయఁబడియుంటి నది స్వప్నమో నిజమో తెలియదు.

సఖు — దేవరా ! అది స్వప్నమే నిజముకాదు.

ఫాదుషా - ఏమో! అదియే నిజమై యిదియే స్వప్నము కారాదా? ఎట్లు నిశ్చయింపనగును.

సఖు – అయ్యో! మీరట్లునుచున్నా రేమి! ఇదిగో మీ లవంగి. చూడుఁడు. ఇది మీ యంతఃపురమే మీరు కన్నులు తెఱచియుండి యిది స్వప్నమని భ్రమపడుచున్నారుగదా.

ఫాదుషా - ఈ మాటలు సత్యములని నేనునమ్మను. వెనుక నీలాగుననే యనుకొని మోసబోయితిని. అప్పుడు కన్నులు ముట్టి చూచితిని తెఱవఁబడియున్నవి. ఒడలు గిల్లుకొంటిని నొప్పిగలిగినది. అట్టి చర్యలన్నియు స్వప్నములు కాలేదా? స్వప్నములో మీరందఱు నాకుఁ గనంబడి యిట్లు చెప్పఁగూడదా?

సఖు - మఱేమి దృష్టాంతము చెప్పిన మీరు నమ్ముదురు?

ఫాదుషా - ఏమో నాకుంతెలియదు. నాకుఁ జిత్తవిభ్రాంతి కలుగుచున్నది. ఇదిగో చూడుఁడు మొన్న గుహలో నా నెత్తి కొకరాయి తగిలి బొప్పికట్టినది. అదియుం గనంబడుచున్నదే? అది స్వప్నమనిన నెట్లు నమ్ముదును.