పుట:కాశీమజిలీకథలు -04.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

రసాలమా! ఈ భృంగము శిరీషకదంబపంకజకురవకకుందాది పుష్పముల సంచరించుగాక. నీగుణము మాత్ర మెప్పటికిని మఱువదు సుమీ! నీవు చింతింపవలదు. అని రసాలవ్యాజముగా వ్రాసి తరుణీ ! ఈ శ్లోకము మీసఖురాలికిమ్ము. రాజకార్యముల తొందరచే నుపేక్షించితిని. నేటి రాత్రియే తప్పక నేనచ్చటికి వచ్చెదననియు నచ్చట నేముచ్చటింపవచ్చునని చెప్పియప్పఁడతిని రహస్యముగాఁబంపి పిమ్మట నతండాత్మగంబుననిట్లు విత్కరించెను. అయ్యో! ఇదియేమికర్మము? పరమపవిత్రంబైన బ్రాహ్మణకులంబునంబుట్టి సకల విద్యలం జదివి పదుగురలో మిగుల ప్రఖ్యాతివడిసిన నాకీ నీచజాతినాతి సాంగత్యంబు తటస్థించుచున్న దేమి? మొదట బ్రమాదవసంబున గలిగినను బశ్చాత్తాపమును జెంది మఱల నిప్పుడప్పని కుద్యోగించు చున్నవాఁడ. అన్నన్నా? ఎంత విచిత్రము? ఇంద్రియములకన్నఁ జంచలమైనది మరియొకటిలేదు గదా. ఎంత బోధించినను వినక నామది యమ్ముదితమీఁదికిఁ బరుగిడు చున్నది. ఏమి చేయుదును. కులభ్రష్టత్వంబు నాకువిధి విధించెఁగాఁబోలు. కాకున్న నా చిన్నది తెలియకమున్న నన్నువరింపనేమిటికి? విద్యాగుణ రూపచాతుర్యాది విశేషంబుల ననన్య సామాన్యయైయొప్పు నాయొప్పులకుప్ప తనంతవచ్చి వరింప మదిచలింపకుండుట కేను భీష్ముండనో శుకుండనో హనుమంతుడనో? ఏనెక్కడ? శుద్దాంతసంచారిణియగు యవనరాజపుత్రి యెక్కడ? ఇది దైవకృత్యంబుకా కెట్లుసంఘటిల్లెడిన పాపభీతి యొకమూలయు దాపభీతి యొకమూలయుఁ బాధించుచున్న యవి ఒకసారి పోయి యత్తన్వకిఁ జెప్పవలసినంత జెప్పి దాని చిత్తముఁ ద్రిప్పివేయుదును. నేనిప్పుడు పోకున్న నాపఁడతి ప్రాణములు విడువఁగలదు. తదీయానురాగ మట్టిదేయని తలచి యాతండానాఁటి ఱేయి గుప్తమార్గంబున నారాజనందన మందరిమునకుం బోయెను. అంతకుమున్న ద్వారమున వేచియున్న కుందలతిలక యతనిం జూచి సంతసించుచు వేగముగా లవంగి యొద్దకుఁదీసికొనిపోయి యాముద్దియ కెఱింగించిన నుప్పొంగుచు నక్కురంగనయన వినయముతో ననేక సత్కారములు స్వయముగా నతనికిఁగావించుచు దల్పంబున సుఖాసీనుఁజేసి యంతికమున నిలువంబడి వీచుచుండెను. అప్పుడు వారికిట్టి సంవాదము జరిగినది.

వీరు - తరుణీ! నీయుపచారములు నన్ను మోమాటము పెట్టుచున్నవి. మొన్న విమర్శింపక మోసపోయితిని. అంతటితో విడచిపెట్టుము. విద్వాంసుడనయ్యు లోకనింద్యములగు కార్యములు చేయవచ్చునా?

లవంగి - ఇది లోకనింద్యమను తలంపు గలిగినచో విడువఁదగినదే.

వీరు - ఏమిటికిఁగాదు?

లవంగి - ఎట్లయ్యెను?

వీరు - పరస్త్రీగమనము పాతకము.

లవంగి - పరస్త్రీగమనము పాతకమౌను.