పుట:కాశీమజిలీకథలు -04.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7]

ఢిల్లీ పాదుషాగారి కథ

49

డుట కవకాశము చిక్కినదికాదు. వారిని గురుతుపట్టియు నతం డెఱుంగనివాడువలె మాటాడక యవసరమీయక తప్పించుకొని పోవుచుండెను. అట్లు కొన్నిదినములు గడచినంత మరియొకనాడు కుందలతిలక పురుషవేషముతోవచ్చి యతండెక్కి,డికో పోవుచుండ గుఱ్ఱము కడ్డంబై కళ్ళెముఁబట్టుకొని స్వామీ! మాయాప్తునొకనిమాయచేసి యొకఁడు చెరగొని తీసిగొనిపోయెను. ఆయాపద మీరు తీర్చవలయు. మీరుమిగుల దయాళురనియు నిందునమ్మదగినవారయు మిమ్మాశ్రయింప నాలుగుదివసములనుండి తిరుగుచుంటిమి మేముపడుబాధలు దైవమునకెరుక. మీరు నా మొరవినక యుపేక్షించితిరేని మీకు జీవహత్య రాఁగలదు. అని నిర్బంధించి యడిగిన నతండు నవ్వుచు నిట్లనియె.

నీయాప్తు నేమిటికిఁ జెరంబెట్టెను. అతఁడెవ్వడు. ఎందున్నవాడని యడిగిన నమ్మగువ స్వామీ ! యేమియు నేరములేకయే చెఱబట్టెను మాకథ రహస్యముగాఁ జెప్పవలసియున్నది. అవసరమీయవలయునని యడిగిననతండు గుఱ్ఱముదిగి దరినున్న గృహంబునకుంజని యారహస్య మేమనియడిగెను. అప్పుడాజవ్వని నవ్వచు ఆర్యా ! మమ్ము మరచిపోయితిరా. నేను లవంగి సఖురాలను. మారాచపట్టిని విరహాగ్ని పాలుచేసి యస్మరణయే మానివేసిరి. ఆ చిన్నది సంతతము మీచర్యలే తలంచుకొనుచున్నది. తండ్రి చెఱమాట యించకయుఁ దలపందు మీ రొకసారి వచ్చి చూడనిచో నసువులు బాయఁగలదు. మా చక్రవర్తి నేమి చేసితిరి ? ఎప్పటికేని విడుతురా ? ఈ రహస్య మెన్నినాళ్ళు కప్పిపుచ్చము. మాకెద్దియేని నుపాయము చెప్పవలయు. నిదుగో మీకేదియో శ్లోకము వ్రాసి మా రాజపుత్రిక యంపినది. చూచికొనుఁడని యొక యుత్తరమిచ్చినది. దానివిప్పి చదువుకొనఁగా-

శ్లో॥ పీతమత్రమధుయాపిక్షపా
     భృంగ ! సర్వమచిరేణవిస్మృతం
     హియమానసుషమాం హిమాగమె
     పద్మినీంయదిహనావలోక సే॥

భృంగమా : రాత్రియెల్ల నాకడ వసించి మకరందమంతయుఁ గ్రోలితివి. ఇపుడది మఱచిపోయితివి. ఇతర పుష్పముల మఱఁగి యొక మాటును నన్ను స్మరింపవుగదా ? యన పద్మిని చెప్పినట్లుగా వ్యాజ్యముగా వ్రాసినది. ఆ యర్ధము గ్రహించి యతండు మఱల నీక్రింది శ్లోకము వ్రాసియిచ్చెను.

శ్లో॥ నిషీదతుశిరీషకే చరతువా కరంటే చిరం
      సముత్పతతు పంకజే కురవకే కరోతు స్తితిం
      దినం సయంతు కుందకే నవరసాల కాల్యనమా
      న్న విస్మరతి కేవలం తవగుణా నసాష్పదం.