పుట:కాశీమజిలీకథలు -04.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

హిందూదైవములు యవనదైవములవంటివారుకారు అడఁకువగలిగియుండు' మని పలికిరి. ఆమాటలు విని యాఱేఁడు భయపడుచు నాత్మగతంబున నిట్లు విపత్కరించెను. అక్కటా? భూమండలమంతయుఁ బాలించు నధికారము గలిగి న్యాయాన్యాయము విమర్శించి ప్రజల బాలించి నేను నిరపరాధులైన హిందువులను వారిదేవాలయమును భగ్నము జేయఁ బ్రయత్నించితిని. దీనికి మూలము నాకూఁతురుగదా? నిర్భాగ్యురా లిట్టి యనవసరము మాలి కోరికఁ గోరనేల? కోరినంతనే యొడంబడి నేనింతప్రయత్నము సేయ నేల? ఆడువాండ్ర విచ్చలవిడిఁ దిరుగనిచ్చిన ముప్పురాకుండనా? సీ? సీ? నాఁకూతురే చెడుగురాలు. మతాంతరదైవముల నారాధింపఁ బూనిన దానినే దండింపవలసినది. తప్పు చేసితిని. ఇప్పుడేమిచేయుదును? నాయైశ్వర్య మంతయు నాశముచేసికొంటిని. ఇది యేదేశమో తెలియదు. ఆహా! విధిగతి యెంతచిత్రమైనది. అని పెక్కుతెఱంగుల దలపోయుచు మఱల వారి కిట్లనియె.

దూతలారా? నన్ను మీ రిప్పు డేమి చేయుదురు? మీయభిప్రాయ మేమి ? ఇది యేదేశము? నాయందు దయయుంచి వక్కాణింపుండని యడిగిన వాండ్రు ఇది నరకము నీవంటి పాపాత్ముల నిట్టి నరకములఁ బడవైచి మాభగవంతుఁడు కొంతకాలము వేధించును. ఆయనకుఁ దిరుగ దయవచ్చినచో వెనుకటి యధికారము లిప్పించును. లేనిచో ఫకీరును చేసి విడుచును. భగవంతుని యభిప్రాయ మెవ్వరికిఁ దెలియఁగలదు. నీవు ప్రతిదివసము మాదేవుని బ్రార్థించుచుండుము. నీయిడుమలం బాపఁగలడు. ఆయన సెలవుప్రకారము నీయొద్ద మేము వసియించి యుంటిమని చెప్పిరి. అదిమొద లాచక్రవర్తి హృదయంబున విశ్వనాథు నారాధించుచుఁ దన్ను విడిచిపెట్టవలయునని యా దూతలఁ బ్రార్థించుచు సాదరముగా వారియుపచారములఁ గొనుచు శోకసాగరంబున నీదులాడుచు నెట్టకే నొకనెలఁ గడిపెను. వీరుఁడు చక్రవర్తిని జెఱఁదెచ్చిన దివసంబున సాయంకాలము మశీదుఫకీరులు వచ్చి వీరునితోఁగలసి ముచ్చటించిరి. అప్పుడు వీరుఁడు యవనసేనలలోని విశేషము లేమనియడిగిన మీదేవతలు నోరుగలవారౌదురు. ఫాదుషాగారికి శరీరములో సంకటము గలిగినదఁట అది మీదేవతల మహాత్మ్యమే యని సంగరము మానవలసినదనియు హిందువులజోలికిఁ పోవలదనియు రాజపుత్రిక యాజ్ఞాపించినదఁట. ఆకారణంబునంజేసి యవనులు యుద్ధవిముఖులై యున్నవారు. చక్రవర్తిగా రీవలకు రాలేదట. ఎటులైన నీపరాక్రమము గొనియాడఁదగియున్నది. నీవు బద్దుండవై యెట్లు తప్పించుకొనివచ్చితివో తెలియక యవనసేనానాయకులు పెక్కురీతిఁ దలంచుచున్నవారు. మాకును విస్మయముగానే యున్నది. నిన్న నీవు లేకపోవుటచేత నీపట్టణమంతయుఁ జెల్లాచెదరై పోయినదని యావృత్తాంత మంతయుం జెప్పిరి.

అప్పుడు వీరుండు వారితో నొకతెఱంగున జెప్పి నమ్మించి సంతోషము గలుగఁజేసెను. లవంగి చెలికత్తియలు కుందలతిలకయు సంగతచంద్రికయు నవ్వీడంతయు వెదకి వీరునిం బట్టుకొనిరి. కాని యతండు పలువురతో నుండుటచే