పుట:కాశీమజిలీకథలు -04.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లవంగికథ

47

చక్రవర్తిగారిప్పుడొరులకు నవసరమీయరట భర్తృదారిక సెలవిచ్చినదని రాజపురుషులతో మేముచెప్పెదము తరువాత కృత్యముల విచారింతమని యుపాయముచెప్పిన వారి బుద్దిబలమున కాముద్దియ సంతసించి యట్లుచేయుటకు వినియోగించినది. పిమ్మట నాకొమ్మలు మొగసాలకుఁబోయి సేనాపతి కాతెఱగెఱింగించి రహస్యముగా పాదుషాగారి వృత్తాంత మరయు తలంపుతోఁ గాశీపురికరిగిరి. అచ్చట చక్రవర్తి నెత్తుకొనిపోయి తెల్లవారకముందు కాశీపురంబునం బ్రవేశించి శత్రుదుర్గమంబగు నొకగుహ యందుఁ బ్రవేశపెట్టెను. వందేకాశీం గుహాం గంగా అని నిత్యయాత్రలోఁ జెప్పబడిన గుహ యదియేసుమీ! ఆ గుహామార్గము నిత్యము చూచువారలకే యగమ్యముగా నుండును. అట్టిగుహయం దా యవనదేశాశ్వరుని బండెబెట్టి యాజగజెట్టి చుట్టును బెక్కండ్ర వీరభటుల గావలియుంచి భోజనాదికృత్యములు సగౌరవముగా జరుగునట్లు నియోగించి పిమ్మటఁ జెల్లాచెదరైన తనబలంబుల మఱలరప్పించి యుత్సాహంబు గలుగఁజేసి యథాపుర్వకముగా వీటిగవనులం గాపువెట్టెను. వీరునిరాక విని పాఱిపోయిన పౌరులందరు సంతోషముతో వెండియు, బట్టణముఁ జేరిరి. పురుషకార్యము దైవకార్యమును ద్రోయఁ గలదా?

ఢిల్లీ పాదుషాగారి కథ

అచ్చట గుహయందుఁ జక్రవర్తికి జాముప్రొద్దెక్కునంత మందుపట్టు వదలుటచే మెలఁకువ వచ్చినదికాని మైకమంతగా బాసినదికాదు. వీరుని నియోగంబునఁ బరిచారకు లాయనకు రాజోపచారములు చేయదొడంగిరి. ఆ విపరీతము గ్రహింపలేక యతండది స్వస్థానమే యనుకొని వారియుపచారములం గైకొనుచు నాకిప్పుడు మిక్కిలి యాఁకలిగానున్నది వేగము నాహారముఁ గూర్చుఁడని చెప్పెను. వారును మృష్టాన్నములువండి పైడిపాత్రలలో వడ్డించిరి. అతండు తృప్తిగా భుజించి యాకలిదీరినంతఁ దెలివివచ్చి నలుమూలలు చూచుచు వారికిట్లనియె. 'అయ్యో? నేనీ చీకటియింటిలో నుంటినేమి? మీరెవ్వరు? మా సౌధమునుండి నేనిచ్చటికెట్లు వచ్చితిని? మావార లేమైరి? పోరు జరుగుచున్నదా?' యని యడిగిన వారేమియు మాటాడిరికారు. అప్పు డాఁఱేడు కన్నులెఱ్ఱజేయుచు 'అన్నా! మీ కింతకావర మేల? నామాటలు వినంబడలేదాయేమి. ప్రత్యుత్తర మీయక నిర్లక్ష్యముగాఁజూచిన మిమ్ము దండింపఁజేయుదుఁ జూడు' డని కోపము జేసిన నవ్వుచు వీరభటు లిట్లనిరి. 'రాజా! మే మెవ్వర మనుకొంటివి. నీ పరిచారకులము కాము స్వామిభక్తులము. పరమకృపాళుండగు విశ్వనాథునకు భక్తులగు హిందువులనెల్ల నీవుకావరించి పీడింపఁ దొడంగితివి కావున నమ్మహాత్ముండే నిన్నీ చెఱసాలం బెట్టించెను. ఇఁక నీకు రాజ్యమెక్కడిది బద్దుండవైతివి చచ్చినపామువలెఁ బడియుండుము. లేనిచోఁ బెడఱెక్కలఁ గట్టింతుము కనికరించి భోజనము పెట్టితిమి.