పుట:కాశీమజిలీకథలు -04.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

తరళాక్షి! ఈకోటనడుమనున్న గృహములన్నియు వెదకితిమి నీమనోహరుఁ డెందును గనంబడలేదు. గుప్తమార్గవృత్తాంత మాయన కెఱిగించితినాయేమి? ఆ దారింబడి కాశీపురంబున కరిగెనేమో? అది యట్లుండె. పాదుషాగా రంతఃపురములో లేరు. వీథికిం బోవలేదంట. పరిచారకులు లేచువఱకే తల్పమున లేఁడనిచెప్పిరి. మన మేడకు వచ్చెనని సంశయమందుచున్నారు. ఇది యేమిచిత్ర” మని యడిగినవిని యదరిపడుచు నప్పడఁతి యిట్లనియె. "యువతులారా? ప్రమాదమే చేసితిని. ప్రియునితో నర్మోక్తులాడుచుఁ బ్రసంగవశంబున శివరాత్రినాఁడు గుప్తమార్గమునవచ్చి విశ్వనాథుని దర్శించితినని చెప్పితిని. తరువాత నచ్చతురుండు మెత్తనిమాటలాడుచు నీకోటలోనున్న గృహముల దారులన్నియు నడిగి తెలిసికొనియెను. అదియునుంగాక మజ్జనకుఁడు శయనించు మందిరవృత్తాంతము వితర్క పూర్వకముగా నడిగిన మోసము తెలిసికొనలేక మాటలకే మురియుచు నంతయుం జెప్పితిని. అయ్యో? చక్రవర్తి నెత్తుకొన పోవలేదుగదా" యని పలికినది. ఆ మాటలువిని యాబోటులు 'నీ తెలివితేట లేమైనవి మర్మములు చెప్పుకొందురా. మాటలకే యుబ్బిపోయితివి కాఁబోలు భళీ భళీ! చక్రవర్తి నెత్తుకొనిపోగలఁడా? అతం డెంతబలవంతుఁడైనను రాజును మేల్కొనకుండఁ దీసికొనపోఁగలఁడా? మిక్కిలి విపరీతముగానున్నదే" అని పలికిన నాకలికి కాదు. మఱియొక దారిఁగూడఁ జూపితిని. తప్పక యతండతని నెత్తుకొనిపోవుటయే నిశ్చయము. తెల్లమైనది. మత్తుగలిగించు ద్రావకకరండ మీబల్లమీదఁ జూచి యిది యేమియని యడిగిన నతనికి దాని తెఱం గెరింగించితిని. ఇప్పు డది యిందుఁ గనబడదు. దానిమూలమునఁ జక్రవర్తికి మత్తుఁ గలగించి యతని గ్రహించిపోయెను. అతండు మిగులబలవంతుఁడుగదా ఇప్పుడేమి చేయుదుము. సేనలన్నియు రాజదర్శనమునుఁ గోరుచుండెను నేఁటియుదయమునఁ గాశీపురము దోపెట్టఁ దలంచిరికాబోలు అన్నా! ఎట్లుజరిగినదో చూచితిరా అతండు దైవబలముగలవాఁడు. మనవారేమియుఁజేయలేరు. తరువాయి కృత్యము మీరే యోజింపుడు. ఈచిత్రముల దలంచుకొన నాకూరక నవ్వు వచ్చుచున్నది. తురకలకు మంచి ప్రాయశ్చిత్తము జరిగిన' దని పలికిన నాజవరాండ్రిట్లనిరి.

“అమ్మా! నీకుఁ గలుకుగాక యేమి? మగడన నంతమక్కువ కాఁబోలు. తండ్రిని అయ్యో? జైఱకొనిపోయెనని యించుకయునీకుఁ జింతలేదేమి? ఎంతకఠినాత్మురాలవి గద !" యని యుల్లసమాడుచు మఱలనిట్లనిరి. “కాశీపురంబుఁ గొల్ల పెట్టుటకు సెలవిమ్మన వీరభటులు సందేశము పంపుచున్నారు. ఈరహస్యము తెలిసిన నన్నితెఱంగులఁ బ్రమాదమే. కావున మఱుంగుపెట్టి చెప్పవలయును. ఇప్పుడు చక్రవర్తిగారు దేహమున స్వస్థతలేక పుత్రికయొక్క మేడయందు వసించిరి. ఆసంకటము హిందూదేవతలఁ బరాభవించుచేఁ గలిగినదని తలంచుచున్నారు. కావున దిరుగ మాయాజ్ఞయగునంతవఱకు సంగరము చేయవలదు. హిందువులను వారిదైవములను ముట్టరాదు. .