పుట:కాశీమజిలీకథలు -04.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లవంగికథ

45

ఇంతలో నా చెలికత్తెయ లచ్చటికివచ్చి తొంగిచూచుచు నా వాల్గంటి నొంటి యైనుంట బరికించి లోనికింజని “యింతీ! ఇదియేమి వింత. ప్రొద్దెక్కినది యెరుంగవా? లెమ్ము లెమ్ము. మనోహరుండేమయ్యె " ననియడిగిన నత్తెఱవ కన్నులు దెరువకయే “ఇంచుఁబోణులారా! ఇంచుక సేపు తాళుఁడు. నాకు మంచి స్వప్నసము వచ్చినది మఱల దానికొరకే నిరీక్షించుచుంటి" నని పలికిన నా జవ్వనులు నవ్వుచు నిట్లనిరి. "అయ్యో! పట్టపగలు వచ్చిన స్వప్నములు పూర్ణఫలము నీయఁజాలవు. మరల నాకల రాత్రి వచ్చునులే ఆ తెరం గెద్దియో మా కెఱింగింపు విని సంతసింతు" మనుటయు నక్కుటిలాలక యరగనుమోడ్పుతో వారిట్లనియె. సఖులారా! మదీయమానసచోరుం డావీరుం డాయువతీమన్మథుండు విద్యాసాగరుం డాకుసుమకుమారుం డావిప్రకుమారుండు మనవారలచే సంగరరంగంబునఁ బట్టువడి కారాగారంబునఁ బెట్టఁబడెను. అప్పుడు మీ యిరువురుంబోయి తాళము విడఁగొట్టి యచ్చతురు నిశ్చటికిం దీసికొనివచ్చి యీ తల్పంబునం గూర్చుండఁ బెట్టిరఁట.

తరువాత నేను జక్కఁగా నలంకరించుకొని మించినవేడుకతోఁ గుసుమ దామముగైకొని యల్లనల్లన వానిదరికరిగి యామాలికహృదయమర్పించుపోలిక వాని మెడలోవైచితిని. పిమ్మట నీసంగీతచంద్రిక వచ్చి మరియొక దండతెచ్చి వానికందిచ్చినది. అతండు చిరునవ్వుతో దాని నామెడలో వైచెను. పిమ్మట మీరరిగిరి అతండాపైనఁగావించిన చర్యను అబ్బా! నేను వక్కాణించలేను. మేనెట్లు గగుర్పొడుచుచున్నదో చూడుఁడు. అయ్యారే! అట్టిసుఖము నాకెప్పుడైనఁ బ్రత్యక్షముగా ననుభవించుట తటస్థించునా? అమ్మయ్యో! నాకే! కలలోనైనను లభ్యము కాదనుట. భళాభళి! ఇది యేమివింత వాతెర నిజముగా మండుచున్నదేమి? అదియేమి? మీరట్లూరకనవ్వెదరు. నావెఱ్ఱిమాటలుకావు? ఏమిచేయుదును. చపలచిత్తనగుటచే నిట్లు పరిహాస్పదురాలనైతి" నని పలికి మఱల నాకల తెఱంగే తలంచుకొనఁ దొడంగినది. అప్పుడు చెలికత్తెలు “పద్మనేత్రా? ఎట్టిచిత్రములు పలుకుచుంటివి. ఒకరాత్రినే మనోహరు మఱగి మాతోఁ గపటము లాడుచుంటివేఁ మఱినాలుగురాత్రులు గడచిన మమ్ము మఱతువు గాఁబోలు చాలుఁ జాలు ప్రత్యక్షముగాఁ జరిగిన చర్యలకు గలఁగంటివని చెప్పుచుంటివా. మనోహరు నెందుదాచితివి. మంచిప్రోడవైతివిలే" యని పలికినవిని యవ్వనిత శయ్యనుండి నగసులేచి యబ్బురపాటుతో నిట్లనియె. “యేమంటిరి? అది నిక్కువమా? ఆఁ ! నానోములు ఫలించినవియా యేమి? అగనగు జ్ఞాపకమువచ్చుచున్నది. మీతోడు సుడీ? నేను నిజముగా స్వప్నమే యని భ్రమయుచుంటిని. అయ్యారే ? అటులయిన నాచెలువుడేడీ? ఆపైగదిలో నుండెనేమో చూడుఁడు. అయ్యో? నావెఱ్ఱిమాటలన్నియు వినియంగాఁబోలు. లఘుచిత్తనని పరిహసించునుగదా" యని నుడువుటయు నాబోటు లిరువురు వడివడిలేచి యందుగల గదులన్నియు వెదకిరి. ఎందునుం గనఁబడిమి నాకోట యంతయు వెదకి మొగసాలకరిగి తిరిగివచ్చి యచ్చంచలాక్షి కిట్లనిరి.