పుట:కాశీమజిలీకథలు -04.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

44

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

ఆ మాటవిని కుందలతిలక "ఆర్యా ! మీ యిరువురకుఁ గృతజ్ఞతాగుణము సమముగానే యున్నది. కావున నామెయభిలాషఁ దీర్చుకొనిన తరువాత మీ కేది ప్రియమో యది కావింపుడు అదియు మాకుఁ బ్రయమే" యని పలికి యక్కలికిని బట్టుకొని బలాత్కారంబునంబోలె నక్కుసుదామం బతనిగళంబున వైపించినది. ఇంతలో సంగీత చంద్రిక వేఱొకమాలిక తీసికొనివచ్చి యతనికందిచ్చుచు ఆర్యా! మీ యభిలాష మాత్రమేల తీరకపోవలమును. దీనికిఁబ్రతి మీరును చేయవలసినదే" యని పలికి యక్కలికి మెడవంచి యతనిచేత నా మాలిక వైపించినది. అన్నన్నా! దాని నియమ మెందుబోయెనో పాండిత్య మేడదాగెనో? దైర్యమెందు మడిసెనో? తన వృత్తాంత మంతయును మఱచి యతండు బాలురచేతి లేడిపిల్లవలె నయ్యంగజాన లెట్లుచెప్పిన నట్లుచేయుచు నంగజాస్త్రభగ్నహృదయుఁడై యితర మెరుఁగక తన్మయత్వమునొందెను. అట్లు వారిరువురంగలిపి యా పరిచారిక లెద్దియో నెపంబు వెట్టికొని యవ్వలికింజనిరి. పిమ్మట వీరుం దపార మోహావేశముతో దదీయపురుషార్థమున గృతార్థుడయ్యెను.

అప్పుడామె వివశయై సొమ్మసిల్లి యప్పల్లవపాణి యా బ్రాహ్మణకుమారుని యురంబున శిరంబిడుకొని గాఢనిద్రావశంవదయయ్యె. నప్పుడు నిద్రబోవక యా వీరుఁడు మోహంబుబాసి యాత్మీయప్రమాదంబుఁ దెలిసికొని యిట్లని తలంచెను. కట్టా! నేనెట్టి పనిఁజేసితి. తురకపట్టి గట్టువిల్తులింగమును ముట్టునని పారులనెల్లఁ గట్టడిచేసి సేనలసమకట్టి బెట్టితనంబుఁజూపి పట్టుపడి తుట్టతుదకుఁ గులము జెడఁగొట్టు కొంటిని. సీ! నా వంటికట్టడి యెందైనం గలదా? అయ్యో! నా పౌరుషమునమ్మి పోరు లెల్లరు వలదని వైరము దెచ్చికొని యిప్పుడెట్టి యిడుమలంబడుచుండిరో. అట్టివారల మఱచి నేనిక్కడఁ బెండ్లి కొడుకనై సుఖియింపఁబూనితిని. ఇస్పిరో! నేను పరమ ద్రోహినైతి. అన్నన్నా? నా వివేకమంతయు దృటిలో బటాపంచలై పోయినదే? అని యనేక ప్రకారములఁ బశ్చాత్తాపము జెందుచు గానిమ్ము. కర్మసూత్ర మెవ్వడు నతిక్రమింపలేడుగదా? దీనిమాట తరువాత విచారించుకొనియెద ఇప్పు డంతఃపురరహస్యములన్నియు నీ చిన్నది నాకు చెప్పినదిగదా? దీనికి తెలియకుండ లేచి పాదుషాగారి మేడకుఁ బోయి యా యింతి చెప్పిన యాద్రావకవిశేషము నతని నాసావివరముననుంచినచో వివశుండగు. నప్పడతని నెత్తికొని గుప్తమార్గంబున నరిగి చెఱబెట్టితినేని నాబంధనము సఫలమగునని నిశ్చయించి మెల్లన నప్పల్లవాధరిశిరము తల్పంబుననిడి సడిగాకుండ జక్రవర్తియొద్ద కరిగి యోషధీవిశేషమున మత్తుగలుగఁజేసి యతని నెత్తుకొని యధికసత్వమున సత్వరముగ గుప్తమార్గంబునంబడి హిడింబారియుం బోలె నవలీలఁ గాశీపురంబునకుం బోయెను. లవంగియు మరునాఁ డరుణోదయంబున మేల్కొని సెజ్జ నజ్జగన్మోహనుంగానక నలుమూలలుజూచి వెఱగుపడుచు నది యొకకలగాఁ దలఁచి మఱియు నదివచ్చునిచ్చనుఁ గన్నులు మూసికొనినది.