పుట:కాశీమజిలీకథలు -04.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లవంగికథ

43

ఇఁక మరియొకదారి జూచుకొనవచ్చును' నని యనేక ప్రకారముం దలపోయుచుఁ దలుపులు తీసినచప్పుడు విని తెప్పున గన్నులఁ దెఱచిచూచెను. అప్పుడు లవంగి చెలికత్తియలు వచ్చుచుండుట దీపము వెలుఁగునఁ దెలిసికొని యట్టె నిలువంబడెను. ఆ యువతులతనికి నమస్కరించుచు నార్యా ! మేము లవంగి చెలికత్తెలము. ఆ చిన్నది మీ యాపద విని మిక్కిలి పరితపించుచు మమ్ము మీ యొద్దకుఁ బుత్తెంచినది. తదీయాంతఃపురంబునకుఁ బోదమురండు అని సవినయముగాఁ బ్రార్దించిన సంతసించుచు నవ్వి ప్రకుమారుండు వారివెంట లవంగియున్న మేడకుం జనియెను.

అట్లాకాంత లిరువురు నేకాంతముగా నతని నంతపురమునకుఁ దీసికొని పోయి యందుఁ దత్సమయోచితమైన యాహారమున సంతృప్తునిం గావించి యొక సుందరమందిరాంతమున నమరించియుంచిన తల్పంబునం గూర్చుండఁబెట్టి తగు నుపచారములం గావించుచుండిరి.

అప్పుడు వీరుఁడు తన యునికికి విస్మయము జెందుచు “నాహా! భక్తపరవశుండగు పరమేశ్వరుని యనుగ్రహమునకు మేఱలేదుగదా? ఇంతదనుక దయావిహీనుండని యా మహాత్ము నిందించితిని. అయ్యారే ఎట్లు సంఘటించెనోకదా? బాపురే! చీమకైన దూరశక్యముగాని యీ యవనాంతఃపుర మెక్కడ? బందీగృహంబున నుండిన నేనెక్కడ? భళి భళి? చోద్యముగానున్నదని యీశ్వరవిలాసముల వేతెఱంగులఁ దలంచుచు నాచేడియల కిట్లనియె. సుందరులారా? నాయందు మీ రాజపుత్రిక కింతయక్కటిక మేలకలిగినది? నిష్కారణవాత్సల్యురాలగు నప్పుణ్యాత్మురాలిం జూడ వేడుకయగుచున్నది. ఎందున్న" దని యడిగిన నాప్రోడలు "ఆర్యా! ఇదిగో నమ్ముదిత నామరుంగున నిలువంబడినది. సిగ్గున మీ యెదుటకు రాకున్నది. ఆమెకు మీరు చేసిన యుపచారములకిది యొక సరియా అదిమొదలు సంతతము మీ మాటయే చెప్పుచుండును. మిమ్మే పొగడుచుండును. మీ గోష్ఠియే చేయుచుండును. మిమ్ము జూడవలయునని యెంతో కోరికతో నున్నది. దైవ మీ కారణమున సమకూర్చెనని సంతసించుచున్నది" అని పలుకుచు 'సఖీ! ఇటురా దాగెదవేల? నీ తలచిన కార్యముఁ జేసి కృతజ్ఞతఁ జూపించుకొను' మని పలికిరి అప్పుడు పుష్పమాలికను హస్తంబునం బూని యించుక తలవాల్చి యల్లన గదిలోనికివచ్చి తల్పముదాపున నిలువంబడినది. తదీయ రూపాతిశయమునకు వీరుండు ధైర్యము చలింప మోహపరవశుండై యదియొక యింద్రజాలముగాఁ దలచుచుండెను. అప్పుడు కుందలతిలక "ఆర్యా! మా రాజపుత్రిక యీ పుష్పమాలికఁ దమ కంఠమునవైచి కృతజ్ఞతఁ దెలుప వలయునని యభిలాషఁ గలిగియున్నది వేఱొకలాగునఁ దలంపకుడు." యని పలికిన నతండు గద్గదస్వరముతో “నోహో! తఱచు మీ రామాటయే చెప్పుచున్నారు. మీ సఖురాలికి నేనేమియుం జేయలేదు. ఇప్పుడు నాకామె చేసిన యుపకృతి వేయిజన్మంబు లెత్తియైనఁ బ్రతిఁజేయలేను. నేననవలసినమాట మీరనుచున్నా" రని పలికెను.