పుట:కాశీమజిలీకథలు -04.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

హిందూబలంబు లప్పుడు నియంతలేని తురంగములభంగిఁ దురకలరాయిడి కోడి చెల్లా చెదరై యరణ్యమార్గంబులంబట్టి పారిపోయెను. అంతలోఁ జీఁకటిపడుటయు యవనులు నాటిదివసంబునఁ గాశీపురంబునం బ్రవేశింపక మఱునాఁ డవ్వీడు దో పెట్టందలంచి యంతటితో మఱలి సేనానివేశమునకుఁ జనిరి. కాశీపురంబునందలి వీరుండు పట్టు పడుటయు బలంబులు పారిపోవుటయుం బరబలంబు మఱుఁనాడు వీడుచొరఁబడి యల్లరి సేయదలంచుటయుం దెలిసికొని పలుదెఱఁగుల జింతించుచు దేవాలయంబులు మూయించి సొమ్ముల దాచికొని గృహంబులకుఁ దాళములువైచి యారాత్రిఁ బెక్కండ్రు గంగానదిందాటి యాసన్నగ్రామం బులకుంజనిరి. పండితభట్టు పుత్రుండు శత్రువులచేఁ బట్టుబడుట విని యడలుచు మరణకృతనిశ్చయుడై యూరుకొనలేక కొందఱ వీరభటుల సహాయులగాఁ దీసికొని యవన సేనానివేశ ప్రాంతమునకుంజని యందందు సంచరించుచు వీరు నేమిచేసిరోయని యరయుచుండెను.

లవంగి ప్రతిదినము యుద్ధవిశేషములఁ దెలిసికొనుచున్నది. కావున వీరుండు బందీగృహమునఁ బెట్టబడుటవిని పరితపించుచుఁ గుందలతిలకతో నిట్లనియె. 'పొలఁతీ? అతండు మనము చెఱసాల నున్నప్పు డెట్టియుపచారములఁ గావించెనో జ్ఞాపకమున్నదా? దానికిఁ బ్రతిచేయ సమయమువచ్చినది. కారాగృహం బెచ్చట నున్నదో యరసి రాత్రి యెట్లయిన వాని బంధవిముక్తుం జేయవలయును. ద్వారపాలుర వంచించి దాటింపుము. అతం డెందుండునో చూచిరమ్ము తరువాత కృత్యముల నాలోచింత' మని పలికిన నవ్వనిత యిట్లనియెను. 'సఖీ! నేనదియంతయు నింతకు ముందే చూచివచ్చితిని. మనమేడ క్రిందిగదిలోనే యతని నునిచిరి. ఆ గుమ్మములో నెవ్వరును లేరు తాళము వైచిరి. సింహద్వారమందే వీరభటులు కావలియుండిరి. కోటచుట్టును సైన్యములున్నవి. ఇప్పుడు మన మా తాళము విడగొట్టి వానిందీసికొని రావలయు నీ సెలవుకొరకే యపేక్షించియుంటి' మనుటయు నక్కుటిలాలక కటకటం బడి "అయ్యో ? ఆలస్యముఁ జేసెదరేల వడిగాఁబోయి తీసుకొనిరండు పాప మాపుణ్యాత్ముండు చీఁకటిగదిలో నెంత చింతించుచుండునో గదా" యని పలికి వారి నంపినది.

అయ్యంగజాన లిరువురును నినుపగుదియలగొని మెల్లన నచ్చటి కరిగి బీగము బడఁగొట్టి దీపము చేతఁబూని యల్లన నాగదిలో'నికిఁ జనిరి. అందుఁ గన్నుల మూసికొని విశ్వేశ్వరు హృదయ సన్నిహితుం జేసికొని “స్వామీ! నేను మీ నిమిత్త మీ తురకలతో బోరాడితిని. నా విషయమై యించుకయుఁ గనికరములేక యీ బందీగృహంబునం పెట్టింతు ఇంత కృతఘ్నుడవని యెరుంగకపోయితినే? జనులందరు నన్నుఁ దురకలకు లొంగుటకు సమ్మతింప నేనొక్కడుంగాదే వలదని యింతగొడవ దెచ్చుకొంటిని. నీవు నాకు సహాయముఁ జేయకపోదువా? యని యంత్వర్యముగాఁ బులిమీసముల నుయ్యలలూగఁ బ్రయత్నించితిని. నీ దయాళుత్వము తెల్లమైనది.