పుట:కాశీమజిలీకథలు -04.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40

కాశీమజిలీ కథలు

కొని యామంత్రి దుఃఖించుచు నా పత్రికను రాజపుత్రిక యొద్ద కనిపి తన కుపకారము చేయుమని వేడుకొనియెను.

దయాహృదయమగు రాజపుత్రిక యా పత్రికను జదివికొని జాలిపడుచు నోపినంతయుపకారముఁ జేయుదుమని ప్రత్యుత్తరమువ్రాసి యూరడించినది. అమ్మరునాఁటి వుదయమునకు ఫాదుషాచక్రవర్తి అరబ్బులు సిద్దులు రోహిలాలు లోనగు యవన సేనావిశేషులు భజియింపఁ బటహభేరీశంఖాదిఘోషంబుల నాకాశంబు బీటలువారఁ బారావారంబులు మేరమీఱి ధారుణీతలం బాక్రమించుచున్నట్లు పటురయంబున బాహువాహినులతో నక్కోటనికటంబున కరుదెంచెను. అప్పుడు వజీరుసేనానాయకుఁడు లోనగువా రెదురేగి లవంగి సురక్షితయై కోటలోనున్నదని చెప్పిరి. ఆ మాటలువిని యతం డించుక యలుకడించి హృదయము సంచలింప సరగ నరిగి పుత్రికం గలసికొని మాటాడెను. యవనులలో జవకాండ్రు తండ్రితో సయితము ప్రత్యక్షముగా మాటాడరు. లవంగి తెరమఱుగున నుండియే తండ్రి కుత్తరము జెప్పినది. వీరునియందుగల మక్కువచే నక్కలికి యతం డడుగమిఁ దనబంధనవృత్తాంత మించుకయుం జెప్పినది కాదు. భూపతుల చిత్తములు పరాయత్తములుగదా? అంతలోనే యతం డాకథ మఱచి వీరభటుల ప్రోత్సాహమున మరునాఁ డుదయకాలంబున యుద్ధము చేయుట కాజ్ఞ యిచ్చెను.

అంతకుఁ బూర్వమే ఫకీరులవలనఁ జక్రవర్తి యుద్యమము దెలిసికొని వీరుఁడు తన బలంబులఁ బోరున కాయితముఁ జేసికొని యుంచెను. మఱునాఁ డుదయకాలంబున యవనభటులు నేల యీనినట్లు భూమియంతయు నిండి కాశీపురాభిముఖముగా నడువఁజొచ్చిరి. యవనుల ప్రయాణ సన్నాహంబు విని వీరుండును రణభేరిం గొట్టించుచుఁ దమ దళంబుల యవనసేన కెదురుగా నడిపించెను. వీరుండు పలువిధములగు నాయుధముల ధరించి తురగమెక్కి తనసేనచుట్టును దిరుగుచు నెక్కడజూచినను తానయై విజృంభించి యవనసేనను గాశీపురము దాపునకు రాకుండఁ గ్రోశదూరము తఱిమెను. యవనసేనాపతి తన సేన వెనుకఁదిరుగుటజూచి యోధులం బురికొలుపుచు దిరుగా హిందూసైన్యముల నెదురుకొనఁజేసెను. అప్పుడా యుభయ సైన్యములకు ఘోరంబుగ యుద్ధము జరిగినది. వీరుడు డందఱి కన్నిరూపులై సాయంకాలమునకు యవనసేనను హుస్సేన్‌బాదుకోట దాపులకు గెంటుకొనిపోయెను.

హిందూసైన్యములో విజయనాదంబులు మేదురంబులై యొప్పినవి. వీరుఁడట్లు తురకదళములం దరిమికొనిబోయి సాయంకాలమైనంత నంతటితోఁ బోరుచాలించి తనబలముల గ్రమ్మఱఁ గాశీపురి దాపునకుం దీసికొనిపోయి వ్యూహములోఁ జేర్చెను. ఆ వార్తవిని ఫాదుషాచక్రవర్తి తన సేనాధిపతుల నాక్షేపించుచు మఱునాఁటి యుద్దములోఁ గ్రొత్తవారి నియమించి నిలిచియున్న సైన్యములన్నియు నొక్కసారి మీఁద బడి పోరునట్లాజ్ఞాపించెను. క్రొత్తగా సేనాధిపత్యము వహించిన యరబ్బీసేనాని బావికం