పుట:కాశీమజిలీకథలు -04.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లవంగికథ

39

నములకు సమ్మతించుననియె. ఈమాటలు మాతోఁ జెప్పఁగాఁ దెలిసికొనివత్తుమని చెప్పి వచ్చితిమి. ఎట్లయిన మన మురగమును జేతితో ముట్టరాదు. లవంగిని దీసికొనిపోయి యప్పగింపుము. మంత్రితో మాటాడవలసిన మాటలం జెప్పుము అడిగివత్తు" మని పలుకఁగా వీరుఁ డిట్లనియె. “సాములారా? మీరు పలుమాఱిట్లు బొధించుచుండ వినకునికి కృతఘ్నతగానుండును. ఫాదుషాభయము నా కించుకయును లేదు. రానిండు మీయానతి చొప్పుననే కావించెదను. ఎన్నఁడును గాశీపురముమీఁద దండెత్తకుండుటకు హిందూదైవముల నిందింపకుండుటకును బ్రమాణపత్రికవ్రాసి యిమ్మనుఁడు. ఈతప్పుఁ గావుఁడని కోరికొనుమనుడు అట్లైన లవంగి నప్పగింతుఁ గానిచోఁ బైనవిచారింతు" నని పలికెను.

ఆ మాటలు విని ఫకీరులు వజీరునొద్ద కరిగి "సామీ! మేము హిందువుల యొద్ద కరిగి సంధిమాటలం జెప్పితిమి. లవంగిని దుర్దశకు బలియిచ్చుటకు సిద్ధముగా నున్నారు ఎక్కడ దాచిరో తెలియదు. కార్యము మిగిలిన నేమి చేయఁగలము. అం దొకరి యధికారము లేదు. అందరు నధిపతులే. వారినందఱు బ్రతిమాలుకొని యెట్టకేలకు రెండుగడియలు మితిఁగోరికొని వచ్చితిమి. వారు కోరిన నిబంధనలకు సమ్మతించితిమి. శీఘ్రమ వ్రాసి యిమ్ము పోవలయు" నని పలకిన విని యతండెటులయిన లవంగి వచ్చినంజాలునని వారు చెప్పినట్లు వ్రాసి వారిచేతికే యాపత్రిక నిచ్చెను.

ఫకీరు లాపత్రికం దీసికొనిపోయి పౌరులందఱం బిలిచి సభఁజేసి పేరోలగంబున నాపత్రికం జదివిరి. హిందువులందరు వీరునిసామర్ధ్యమును వేనోళ్ళఁబొగడుచుఁ బూవులచే నతనిఁబూజించిరి. ఆపత్రికం గైకొని వీరుఁడు రాజపుత్రిక నప్పుడే యాందోలిక మెక్కించి మేళతాళములతో హుస్సేనుబాదుకోటలోనికి నంపించెను. ఆమెరాకఁజూచి మంత్రి దన్నుఁ బునర్జీవితునిగా దలంచుకొనుచు వీరభటుల యుద్ధవిముఖులఁ గావించి ప్రయాణోన్ముఖుండైయున్న సమయంబున పాదుషాగారియొద్దనుండి మఱియొకజాబు వచ్చినది. ఆ పత్రికవిప్పి చదివిన నిట్లున్నది. వజీరునకు ఫాదుషా చక్రవర్తి నిరూపించిన యాజ్ఞ యేమనఁగా నీవు మాయానతిలేనిదే ప్రాణసమయగు లవంగి నిచ్చటికిఁ బయనముచేయుట యపరాధమైయున్నది. పంపితివిపో, తగిన సేనలసహాయముగా నియ్యక చిడుగుదళముతోఁ బంపుట రెండవతప్పు. హిందువు లామెం దీసికొని పోయినపిమ్మట నేమి చేసినది వ్రాయకపోవుట మూడవతప్పు. ఈ యపరాధత్రయమునకు నిన్నుఁ బ్రస్తుత ముద్యోగము నుండి తప్పించితిమి. నీసమాధానము వినిన పిమ్మట ననుగుణంబగు శిక్ష విధింపఁబడును. మే మెద్దానికోరికఁ దీరుప నెంతసన్నాహముగావింతుము. యట్టిపట్టి జఱపట్టిన శత్రువులపాలుసేయుమే సకలసైన్యముతో మాపటికి వచ్చుచున్నాము. హిందువుల నాబాలవృద్ధముగా జెఱనిడవలెనని చెప్పుము. పెక్కేటికి నప్పట్టణం బంతయు నీటంగలపెదననియున్న యుత్తరవుఁ జదివి