పుట:కాశీమజిలీకథలు -04.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

334

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

మొగము జూచి నాఁడించుక సందియమంది పోలికయట్లున్నదని యుపేక్షించితి. నీపరిగిన తెఱం గెఱిఁగింపుమని యడిగెను.

అప్పుడు వసుంధరుండు వారినెల్ల సావకాశముగా కూర్చుండఁ ప్రార్థించి తన వృత్తాంతము గళానిరయ వృత్తాంతము నింతయేని కొరంతవెట్టక పూసగ్రుచ్చినట్టు లామూల చూడముగా నెఱిగించి వారినెల్ల నాశ్చర్యవారధిలో ముంచివేసెను. వారట్లు మాటలాడి కొనుచుండగనే సూర్యోదయమయినది. అప్పుడు రాయలవారు పరమానంద భరితహృదయులై తమ్ముఁజూచి లజ్జావిషాదంబులు బాధింప నొదిగియున్న పుత్రికం గౌగిలించుకొని వియోగదుఃఖ మభినయించుచున్న యా బాలిక నూరడించెను. పదం వడి యా యుదంతమంతయుఁ బట్టణంబునఁ జాటింపంజేసి మంగళతూర్యములతో భద్రగజంబుపై వారి నెక్కించి యూరేగింపుచు నా రాజపంచాస్యుండు వారి నిరువురఁ దల్లులయొద్ద కనిపెను.

మందారవల్లి యుఁ గళానిలయము నవత్య దర్శనంబునం జేసి సంతాన వియోగ దుఃఖమునకు నానంద బాష్పోదకము ధారవోసి విడిచి వేసిరి. అప్పడు రాయలవారు కుముద్వంతునకు వసుంధరుని చారిత్ర మంతయు గూడముగాఁ దెలియ జేసి నా పుత్రికఁ గళావతి నీతనికి బెండిలిఁజేయ బూయచున్నాను నీవును గౌముదినిఁ గూడఁబెండిలిసేయుమని యుత్తరమువ్రాసెను. పిమ్మట రాయలవారు పట్టణమంతయు నలంకరింపఁజేసి శుభముహూర్తమున బెక్కు వైభవములతో వసుంధరునకుం గళావతి నిచ్చి వివాహము గావించిరి. ఆ కల్యాణము జరిగిన కొన్ని దినములకు కుముద్వం తుండును వసుంధరునిఁ దీసికొనిపోయి కౌముదితోఁ గూడ దనరాజ్యమతని యధీనము జేసి పట్టభద్రుం గావించెను.

వసుంధరుఁడును నిద్దఱి భార్యలతో సుఖింపుచుఁ బెద్దకాలమమహారాజ్యము పాలించెను. అని యెఱింగించి గోపా ! యీ కథవలన మందారవల్లి కళానిలయలలో నెవతె విద్వాంసురాలో తెలిసినదా ? యని యడిగిన వాడు నమస్కరించుచు స్వామీ ! మీరు చెప్పినం దెలియదా ! మందారవల్లి కొడుకునకే సమాధానము చెప్పలేక పరితపించిన కళానిలయ మందారవల్లి తో నెట్లు తులవచ్చును. అన్ని గతుల నప్పడతియే శ్రేష్ఠురాలని చెప్పెను.

మణిసిద్ధుండును వాని బుద్ధి విశేషమునకు మెచ్చుకొనుచు నుచితకాలంబున నటఁగదలి వాఁడు గావడియెత్తుకొని సడుచుచుండఁ దదనంతరావ సధమునకుఁ బోయెను.