పుట:కాశీమజిలీకథలు -04.pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కళావతీసుందరుల కథ

331

యాలోచింపుము. నాఁడు మందారవల్లి ని జయించినట్లె యట్లే వీనిని బరాజితుని గావించి మమ్ముఁగాపాడుము. వాని యెదుట బడితిమేని యవమానింపక విడువఁడు. దాని యెదుట బృహస్పతియయినను నిలువఁజాలఁడు. నీ విప్పుడభయహస్త మిచ్చిన నుందుము కాదంటివేని నాలుబిడ్డలతో నిల్లువిడిచి యెక్కడికేనిం బోవుదుమని యేక వాక్యముగాఁ బ్రార్ధించిన విని రామలింగకవి నవ్వుచు నిట్లనియె.

మిత్రులారా ! నే నేమి చేయుదును ? నాకును వాని యెదుట నే మాటయు స్ఫురింపదు. ఏమియుఁ దోచకయే కాదా యా రాజున కిట్ల సత్య పత్రికలం బంపితిని. అంతటితోఁ బోవుననుకొంటిని గాని వెన్నంటి తరిమికొని వచ్చెను. మఱియుఁ గుముద్వంతుఁడు మనలఁ బెద్దగా వర్ణించుచు ధర్మసందేహము దీర్చుఁడని పత్రికలువ్రాసెను. దానిలో వీఁడొక వాదియఁట అది యేమియో కాని వానిపేరుఁ దలంచినంతనే యెడద వెఱవుగలుగుచున్నది. నాకును వానితోఁ బ్రసంగించుటకు వాక్కురాదు. మనమందరము పోయి గూఢముగా వాని నాశ్రయించి ప్రసంగము చేయకుండ నవ్వలసాగనంపుటయే యుచితమని చెప్పుటయు నా పనియు నీ పురస్కరముగనే కావలయునని కోరి కొనిరి.

అమ్మఱునాఁడు రాత్రి కొంచెము ప్రొద్దుపోయిన తరువాత నా పండితు లందఱు గుమిగూడి దేవగుప్తుఁడున్న పూవుఁదోటకుఁ బోవుచుండిరి. కృష్ణరాయలు రాత్రులయందప్పుడప్పుడు మారు వేషముతోఁ బ్రజల యభిప్రాయములఁ దెలిసికొనుటకై తిరుగుచుండును. నాఁడొక బీదపాఱుని వేషమునఁ దిరుగుచు పండితులుసందడిగా మాటలాడికొనుచుఁ బోవుచుండుట జూచి తానును వారి వెనువెంట గూఢముగా నడచు చుండెను. అది వారెఱుంగక క్రమంబున నా పూవుఁ దోటకుం బోయి యొక పొదరింటిదరి నిలువంబడి తమ రాక పరిచారిక ముఖముగా దేవగుప్తునకుం దెలియజేసిరి. ఈ లోపల నృపాలుండు వారిం దెలియకుండ లోపలికిఁబోయి యొక వాక్షము దాపునఁ గూరుచుండెను.

అట్టి సమయమున పసుంధరుండును గళావతియు నిట్లు మాటలాడుకొను చుండిరి.

వసుం - కళావతీ ! మనమీవీడు విడిచి నాలుగు సంవత్సరములు దాటినవి. మనల గుఱించి మనవా రేమనుకొనుచుందురో !