పుట:కాశీమజిలీకథలు -04.pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

328

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

తృతీ - ప్రకటనలో నట్లు లేదే గెలిచినచోఁ బదివేలమాడలిప్పింతునని నోడినవాని నురిదీయింతుననియు వ్రాయఁబడియున్నది.

ప్రథ – వ్రాఁతలో నామటలేదుగాని హృదయంబున నట్లు నిశ్చయించు కొన్నఁదట అందులకే బ్రాహ్మ క్షత్రియ కులజులేకాని యితరులు పనికిరారని వ్రాయించినది.

తృతీ - పోనిమ్ము ఇప్పుడేమి? మొన్న గళావంతుఁడను విప్రకుమారుఁడు జయించెనుగదా ! వానిం బెండ్లియాడరాదా ? సభలేల ?

ప్రథ — వినుము. మొన్న నీనడుమ పట్టపేనుఁగ మదముదిగి కావించిన యల్ల రిలో రాజపుత్రిక చావవలసినదియేకదా.

తృతీ -- అవును. అప్పు డెవ్వఁడో యొక విప్రకుమారుఁడు రక్షించెనని చెప్పుకొనిరి. నేనప్పుడు రాలేదు.

ప్రథ - ఆ చిన్నది భయమున వానిం గౌగలించుకొన్నది. కావున వానికే పెండ్లిచేయుట యుచితమని రాజు వానికిఁ దెలియజేసెను.

తృతీ - అతండు కుమర్తెపట్టిన శపథ ప్రవృత్తి యెఱుంగడుకాఁబోలు తరువాత ?

ప్రథ - ఆ మాట విని యా బోఁటి యంతకుఁ బూర్వమే కళావంతుల బెండ్లియాడెదనని యతని కుత్తరము వ్రాసియున్నది. కావునఁ దండ్రితో నప్పుడు తన యుద్యమము చెప్పినది.

తృతీ - ఓహో ప్రమాదమే జరిగినది.

ప్రథ - రాజు ధర్మశాస్త్ర ప్రకార మెవ్వరి కక్కన్య నిచ్చి పెండ్ల చేయవలెనని పండితుల బిలిపించి సభ జేయించెను.

తృతీ - అదియా కధాసందర్భము తెలిసినది. తెలిసినది. ఈసారి చెప్పు మనుము.

ద్వితీ - చెప్పుట కేమియున్నది. రాజకన్యలకు స్వయంవరము శాస్త్రములోఁ జెప్పబడియున్నది. కావున నా పూవుఁబోడి మొదట పరించినవాఁడే భర్తయగునని మొదటితెగవారు సెప్పిరి.

తృతీ - రెండవ తెగవారేమనిరి ?