పుట:కాశీమజిలీకథలు -04.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

326

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

తండ్రికే ఖ్యాతిఁ దెచ్చుంగాదా ? పుత్రాదిచ్ఛేత్ప రాజయమను నార్యోక్తిని వినియుండ లేదా ? యని చెప్పి యతనికి సంతోషము గలిగించితిని.

అప్పుడా బ్రాహ్మణుఁడు లేచి భుజించి నన్ను స్తుతిఁజేయుచు నావిద్యలం బరీక్షించుచు నా దివసము సంతోషముతో వెళ్ళించెను. మఱునాఁడు మలధ్వజుఁ డొక పల్లకీ బంపెను. నేనావిష్ణుగుప్తుని కండలములు శాలువులును గంకణములును దాలిచి యా సిబికనెక్కి యా సభకుఁబోయి విష్ణుగుప్తుని కుమారుండనని చెప్పుకొని ప్రసంగించి వారిం బరాజితులఁ గావించితిని తరువాత వృత్తాంతము నీవు వినినదియేకదా యని చెప్పిన నప్పడఁతి ప్రహర్ష సాగరంబున మునుంగుచు నిట్లనియె.

కళావతీ వసుంధరుల కథ

ఆర్యా ! నీ యౌదార్యంబు నీ దాక్షిణ్యంబు నీసౌశీల్యంబు వేనోళ్ళ గొనియాడదగియున్నది. సామ్రాజ్యంబు గవ్వగాగణించి సన్యాసిం గరుణించి విడిచిపెట్టితివి. పుత్రుండవని చెప్పికొని విష్ణుగుప్తుం బాలించితి వింతకంటె సాద్గుణ్యమేమి యున్నది అదియట్లుండె గండుమీరి జంతుతండంబులఁ జండాడెడు మత్తవేదండంబు తుండంబు బట్టుకొని గండరగండడనై నీవారాజసందనం గాపాడినకథ మిక్కిలి యాశ్చర్యము గలుగజేయుచున్నది. నీకిట్టిపౌరుష మెక్కడినుండి వచ్చినదని యడిగిన నతండప్పుడు యక్షిణి దలంచుకొనుటచే నాకాహస్తివశ్యమైనదని చెప్పుచు మఱియు నతం డింతీ ! నీ పురుషవేషము గడువింతగానున్నది సుమీ ! దానఁజేసియే గౌముది తండ్రిమాట గణింపక నిన్ను వలచి నీ కుత్తరము వ్రాసినది వేగబోయి యాయెలనాగం బెండిలి యాడనా ? యని పరిహసించిన నమ్మించుఁబోఁడి యార్యా ! కరివెరపున నిన్నా యన్నులమిన్న తిన్నగాఁ జూడకపోవుటకే నన్ను వరించినది పోనిండు. ఎట్ల యినను యా జవరాలు మీకే దాసురాలగును యజమానునకు భ్పత్యుని భృత్యుండును భృత్యుఁడే యగుంగదా? యని పలుకుచు శృంగార విలాసము లంకురింప సప్పంకజాక్షి యపాంగ వీక్షణములతనిపై వ్యాపింపఁ జేసినది. అప్పుడప్పూబోఁడి చూపుకైదువుల నాటించి యవకాశము జేసికొని కుసుమశరుం డక్కుమారుని హృదయంబునఁ బ్రవేశించెను.

ఉ. పున్నమినాఁటిచ దురుని • బోలుమొగంబును జిన్నిచన్నులున్
    సన్ననికౌను ముత్తియపు • చాలనఁగ్రాలు రదాలు మేల్పదా
    ఱ్వన్నెకడానిమేనిజిగి • వాలుకనుంగవ గల్గి కూకటుల్
    చెన్నువహింప బాల రహి • సేయదె జవ్వన మూనువేళలన్.