పుట:కాశీమజిలీకథలు -04.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

324

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

అప్పుడతండు నీవు గళానిలయ కూఁతురువయినచో నేను మందారవల్లి కుమారుండనేమిటికి కాకుందును ? నీ యుదంత మాద్యంత మెఱింగింపుమని వాక్రుచ్చిన నబ్బురమందుచు నాసుందరి ఆహా ! నీవు వసుంధరుఁడవని యప్పుడే యనుకొంటి. అందులకే నిన్నాశ్రయించి తిరుగుచుంటి దైవ మభీష్ఠము సమకూర్చెనని మెచ్చుకొనుచుఁ దానడవిలోఁబడి బరితపించినది మొదలు నాఁటి తుదదనుక జరిగిన యుదంత మంతయుం జెప్పి నీవీనామముతో నిట్లు తిరుగుటకుఁ గారణ మేమని యడిగినది.

అక్కధవిని యతం డక్కజమందుచు సుందరీ ! నీవరణ్యమునం బడితివని యక్షకన్యాసంభాషణ శ్రవణంబున నాకుఁ దెల్ల మయినది కావున నీవు కళావతియని యనుమానము జెందుచుంటిని. దానంజేసియే యనుసరించి తిరుగుటకు సమ్మతించితిని. సంతసమయినది. నావృత్తాంతము నినుము. నీవలెనే నేనును నొకనాఁటి యుదయమున యక్షిణీశైల శిఖరమునఁ బడియుంటి నందలి కారణము దెలియక పరితపించుచు నందొక పరివ్రాజకుఁడు గనంబడిన నతని నాశ్రయించి తత్పర్ణ శాలలోఁ బది దినములు వసించితిని. అతండు నన్ను యక్షిణీదేవతకు బలియిచ్చుటకు సిద్ధపడిన గ్రహించి నేనే వాని శిరంబుఁ ద్రొక్కి పెట్టి యమ్మవారికి బలినీయ నుద్యోగించితిని. అట్లు చేసితినేని యక్షిణి ప్రత్యక్షమయి కోరిన కోరికలన్ని యుఁ దీర్చునఁట వాని పరిదేవనము విని జాలిపడి బ్రహ్మహత్యకు వెఱచి సంపదల లక్ష్యము సేయక వాని జడల గొఱిగి విడిచి పెట్టితిని.

విష్ణుగుప్తుని కథ

తరువాత నద్దేవికటాక్షముననే యాయక్షిణీ శైలమవలీల దాటి జనపదంబు లంబడి నడుచుచు నొకనాఁడు మధ్యాహ్నమునకు నీ మహేశ్వరాగ్రహారమున కరుదెంచి యందు విష్ణుగుప్తుం డతిధుల సత్కరించునని విని వారియింటికిం బోయితిని. యజమానుని యనుమతి నందున్న వారు నన్నెక్కుడుగా గౌరవించుచు భోజనము పెట్టిరి. నాఁడు విష్ణుగుప్తుండును భార్యయుం గుడువక యొకగదిలోఁ బండుకొని యేమిటికో విచారింపు చుండిరి. పలుమారు వారి భృత్యులు పోయి కుడువరమ్మనిరి. కాని వారిమాట వినిపించుకొనలేదు. అప్పుడు తక్కిన వారును గడువ మానివేసిరి. ఆవిచారమునకుఁ గారణమేమని నేను వారినడిగిన నాభృత్యులలో నొకఁడు రహస్యముగా నిట్లు చెప్పెను.