పుట:కాశీమజిలీకథలు -04.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

41]

కౌముది కథ

321

విని సంతసముతో నచ్చటి కేగెను. అప్పుడు వీధి తలుపులు మూయంబడి యున్నవి. ఆతని బిలిచినంత భుజింపుచున్నవారు అంతదనుక వాకిట నుండుఁడని యెవ్వరో చెప్పిరి. ఆ మాట విని యాదూత యమ్మయ్య ! యిప్పటికి నాకష్ట గట్టెక్కినది. ఇటువంటి శుభవార్త దెచ్చినందుల కాయన నాకుఁ దగిన పారితోషికమియ్యుఁగాక యని యాలోచించుచున్న సమయంబున మఱియొక రాజభటుఁ డచ్చటికివచ్చి విష్ణుగుప్తుని యిల్లిదియేనా ? యని యడిగిన నందున్నదూత యిదియే యిదియే ఇటురాయని చెప్పెను.

ఆ మాటవిని యా భటుఁడు వానిదగ్గరకువచ్చి యెహో? కౌస్తుభా నీవిక్కడ నుంటివేమని యడిగిన నతఁడయ్యో ? నందకా ! నీవా ? మఱియెవ్వడో యనుకొంటి. నీ వేటికి వచ్చితివని యడిగిన నందకుఁడు మన రాజనందన కళావంతుఁడను బ్రాహ్మణ కుమారునికేదియో యుత్తరమిచ్చినది. అతండిక్కడున్నాడని తెలిసివచ్చితినని చెప్పెను. కౌస్తుభుఁడునుమన రాజపుత్రికను మృత్యుముఖంబునుండి తప్పించిన దేవగుప్తుడను విప్రకుమారునికిఁ బెండ్లిచేయు తలంపుతో మనరాజుగారే వానిందీసికొని రమ్మని నాకీ శుభలేఖయిచ్చి యంపిరి అతండు నిందేయున్నాఁడు. అందులకై వచ్చితి నని చెప్పెను.

అట్లువారిరువురు మాటలాడికొనుచుండగా దేవగుప్తుడును గళావంతుఁడును భోజనముచేసి తలుపులు దెరచుకొని వాకిటకు వచ్చిరి వారింజూచి యాభటు లిరువురు లేచి జోహారుచేసిరి. వారు మీరెవ్వరని యడిగిన వాండ్రు కుముద్వంతుని ప్రతిణిధులమని చెప్పుచు వారుదెచ్చిన పత్రికల వారికిచ్చిరి. అప్పుడు పైవిలాసముల ననుసరించి యెవరి యుత్తరముసు వారుదీసుకొని విప్పి చదువికొనిరి.

దేవగుప్తా ! నీవు దైవమువలెవచ్చి మృత్యుదేవత నోఁటిలోఁబడిన నా కూఁతురనులాగ బ్రతికించితివి, నీ యుపకారమున కేదియుఁ బ్రత్యుపకారము చేయ నేరను. అప్పడఁతి యప్పుడే నీ వామభాగమైనది. కావున వేగవచ్చి యచ్చెల్వం బెండ్లి యాడి రాజ్యభారము వహింపుము, అని దేవగుప్తునకుఁ గుముద్వంతుడు వ్రాసిన యుత్తరములో నున్నది.

మనోహరా ! భవదీయ మనోహరాకారముచూచియే యాటలో ----------- పొసంగితిని. ఆటఁకు బూర్వమే నా హృదయమర్పించితిని. హృదయ------------------ లేమి చేయఁగలదు ? నీవు భర్తవని యిదివరకే యుత్తరమువ్రాసి యంపితినిగదా ? ఇప్పుడు