పుట:కాశీమజిలీకథలు -04.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

320

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

కౌ - జ్ఞానవతి యెందున్నది?

ప్ర - అదిగో మాటలో నిటే వచ్చుచున్నది.

జ్ఞా -- (ప్రవేశించి) ప్రజ్ఞావతీ ! నావంకఁ జూచుచున్నా వేమి ?

ప్ర - మన రాజపుత్రికను నేనుఁగవలన విడిపించినవాని పేరేమి?

జ్ఞా - దేవగుప్తుడు.

ప్ర - వానిని నీవు చూచితివా ? వాని యంద మెట్లున్నది.

జ్ఞా - నేనుఁ జూచుటయేకాక పరిచయము గలుగఁజేసికొని మాట్లాడితిని. వానియందము మనుష్యులకేకాక, దేవతలకు, యక్షులకు, సిద్ధులకు, విద్యాధరులకుఁ గిన్నరులకుంగూడ లేదని చెప్పఁగలను.

ప్ర - అంతయేమిటికిఁ గళావంతుడు చక్కనివాడా? అతఁడు చక్కని వాఁడా ? ఇద్దఱి తారతమ్యము జెప్పుము.

జ్ఞా - కళావంతుఁడు చక్కనివాఁడేకాని యాఁడుపోలిక వచ్చినది. దేవగుప్తుడు పురుషసింహుఁడు కాదా ? వానికి వీనియందము చాలదు.

ప్ర - పోనీ, మన రాజపుత్రికకెవ్వడు తగినవాఁడో చెప్పుము.

జ్ఞా -- దేవగుప్తుడే తగినవాఁడని నా యభిప్రాయము

ప్ర -- కళావంతుం బెండ్లి యాడుదునని రాజపుత్రిక జెప్పుచున్నది.

జ్ఞా - మనరాజుగారు దేవగుప్తునికిఁ బెండ్లి జేయుదమని వెంటనే రమ్మని శుభలేఖ వాసియంపినది యీమె యెఱుంగదు కాఁబోలు !

ప్ర - అప్పుడే శుభలేఖయు పంపిరా! ఇంతను నీవార్తకింవదంతియని చెప్పితిని.

జ్ఞా - కింవదంతియేల ? నొడయఁడు పెండ్లి ప్రయత్నమె చేయుచుండెనే :

కౌ - ఏమీ మా తండ్రి పెండ్లి ప్రయత్నమే చేయచున్న వాఁడా? దేవగుప్తుని రమ్మని వార్తనంపెనా : కానిమ్ము అంతకుముందే కళావంతుఁడు వచ్చునట్లు జేయుఁడు. అప్పుడు మా తండ్రితోఁజెప్పి యొప్పించెదను.

జ్ఞా - వానితండ్రి సదాచారి వెనుకటి సొమ్మిమ్మని దాని యుత్తరము దీసికొనివచ్చి యడిగిన ఱేఁడు వానిని రమ్మని చెప్పమని యప్పాఱుం బంపెను. వాడెట్లయిన రాఁగలఁడు.

కౌ - అట్లుకాదు. ఈ విషయము వివరింపుచుఁ బ్రత్యేకముగా మన సందేశము పంపుఁడు.

జ్ఞా - భర్తృదారిక యెట్లు చెప్పుచున్నదో యట్లుచేయుచున్నాము అని యందఱు నిష్క్రమించిరి.

రాజచోదితుండగు దూత దేవగుప్తు నరయుచు దిరిగి తిరిగి యొకనాఁడు మధ్యాహ్నమునకు మహేశ్వరాగ్రహారమునకుఁ బోయి విష్ణుగుప్తునింటిలో నున్నవాఁడని .