పుట:కాశీమజిలీకథలు -04.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మదపటేనుగు కథ

317

బోయెలాతురము నొందుచు నా శిబిక నేలం బడవైచి తలయొక దారింబారిపోయిరి. జీవితముకన్న తీపుగలది మఱియొకటిలేదు గదా! అప్పుడమ్మత్తంగజము ఘీంకారముఁ గావింపుచు నా పల్లకీ దండికిఁ దొండంబుజుట్టి యెత్తు నంతలో నందున్న రాజనందన తటాలున నేలకు దూఁకి పారిపోవఁ దొడంగినది. ప్రాణమున్నంతవరకు జీవితాశ వదలదుగదా.

అట్లావేదండంబు తుండంబున నాపల్లకినెత్తి నేలంబడగొట్టి కాలితోఁ ద్రొక్కి వేయిచెక్కలు గావించినది. అందా రాజనందన యుండిన నేమగునో ? ఆ దంతియంతటితో విడువక వడివడిఁ బరుగిడుచున్న యా చిన్న దానిమీఁదికి బోఁదొడంగినది. అప్పుడు దూరమందుండి ప్రజలు రాజపుత్రిక చచ్చెనని యఱచిరికాని యొక్కడైన నడ్డుపడరైరి.

అవ్వేదండంబు కుండాదండబు సాచి య్యయండజ యానంబట్టి కొనఁబోవు సమయంబున నెక్కడినుండి వచ్చెనో యొక విప్రకుమారుం డంతలోఁ గలసికొని యెడమచేత నా నాతిం బట్టుకొని కుడికరంబున నగ్గజకరం బదిమిపట్టి యట్టెనిలఁబెట్టెను. ఆహా ! ఆ మహామహుని బాహుదండంబు తుండంబుపై నిడినంత నవ్వేదండంబు మంత్రించినట్లు కదలక చిత్తరువుమాడ్కి నిలువంబడినది. ఎంత చిత్రమో ? అప్పు డప్పడతి యప్పురుషసింహు నెడమపార్శ్వంబు బిగ్గరం గౌఁగిలించుకొని కన్నులం దెఱవక భయంబునఁ బెనుగాలింగదలు తీవయుంబోలె వణకఁ జొచ్చినది.

ఆ భూసురసూనుండు పూవుఁబోడీ ! భయపడకుము. ఈ మదగజము నిన్నే మియుం జేయనేరదు. దీనిపై నెక్కుము తలపూవు వాడకుండ నిన్న మీ యింటికిఁ జేరుతునని పలుకుచు స్తంబేరమమును నేలంబండఁ బెట్టిన నా రాచపట్టి యతని పార్శ్వంబు విడువక భీతియై దానిపై కెక్కినదికాదు. అప్పుడతం డొకచేత నేనుఁగు తొండంబు బట్టుకొని యొకప్రక్క నక్కలికి నానికొని పట్టణాభిముఖుండై నడువఁ జొచ్చెను. అహితుండికునకు వశ్యంబైన కుండలియుంబోలె నమ్మాతంగం బతని యాజ్ఞకు లోనై యనుచరుండట్లు పార్శ్వభాగమున నడుచుచుండుటఁజూచి వారు లద్భుతరసావేశ హృదయులై యతని నయ్యతివంగాపాడ నరుదెంచిన భగవంతుఁడని స్తోత్రములు చేయుచు గ్రమంబున భయంబు వాసిమూగికొనఁ దొడంగిరి

అంతలో మదగజంబు కౌముదింబరిమార్చు చున్నదన్న వార్త విని యా భూభర్త యత్యంత దుఃఖముతో నాయుధపాణులైన పెక్కండ్రు వీరభటులతోఁ గూడికొని యతి రయంబున నా దెస కరుదెంచుచు నెదుర నమ్మదగజ ---------- లిరువంకల నలంకరింప నభిముఖముగా వచ్చుచున్న యా విప్రకుమారుం గాంచి హర్ష పులకాంచిత శరీరుండై యమ్మత్తకాశిని యప్పురుషసింహుని వలన రక్షింపఁబడిన వార్త పౌరు లెఱింగింప నతనిం దైవముగా భావించి తత్పాదంబులకు సాష్టాంగ నమస్కారము గావించి బలువిధములఁ గొనియాడెను.