పుట:కాశీమజిలీకథలు -04.pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

316

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

యక్కడికి వచ్చితిమి. అమచ్చెకంటితో నాడి యోడించి యా కానుక నందితిని. ఇక్కడఁ దమ పండితపుత్రుఁడు దేవగుప్తుఁడనువానితో శాస్త్రములలోఁ బ్రసంగించి గెలుపుకొనినవానికి మూడుగ్రామము లిత్తురని ప్రకటించిన విని యిక్కడికి వచ్చితిమి ఇదియే మా రాకకు నిమిత్తమని పలికిన సంతసించుచు నా భూపతి సగౌరవముగా వారికిం దగిన విడిది నియమించి యప్పుడే దేవగుప్తుం దీసికొనిరమ్మని విష్ణుగుప్తునొద్ద కొక దూతంబంపెను. ఆ ప్రాంతమందున్న మహేశ్వరాగ్రహారమునకుం బోయి యా రాజుదూత, విష్ణుగుప్తుంకాంచి నమస్కరించుచు మీ కుమారుఁడు దేవగుప్తం గళావంతునితో బ్రసంగింప సత్వరమ పంపించుమనిరని నరనాధుని శాసనం బెఱింగించిన నాలించి యా బ్రాహ్మణు డెద్దియో ధ్యానించి నిట్టూర్పు నిగుడింపుచు దేవగుప్తుం డూరలేఁడు. గ్రామాంతర మఱిగియున్నాఁడు. పదిదినములలోఁ దీసికొనివత్తునని పార్థివోత్తమునితోఁ జెప్పుము అని గడువుగోరి యా భృత్యునంపి తాను వాని వెదకుటకై బయలుదేరి పోయి పోయి యొకనాడు రాత్రికి గుముద్వతీ నగరము చేరెను.

అందొక గృహస్తునింట భుజించి భోజనాంతరమున అయ్యా ! ఈ పట్టణమున దేవగప్తుండను బ్రాహ్మణకుమారుఁడు రాలేదుగదా యని వాని గురుతులు జెప్పిన విని యప్పారుఁడు విస్మయమేపార భూసురోత్తమా అతఁడు నీకేమైనఁ జుట్టమా యని యడిగిన నా కుమారుండేయని జెప్పెను. ఆ మాటవిని యా యజమానుఁడు నీ కుమారం డీ యూరెప్పుడు వచ్చెనో మాకుఁ దెలియదుకాని మొన్న రాజపుత్రికను జచ్చినదానిం బ్రతికించె నా వృత్తాంతము చెప్పెద నాలింపుము.

మదపుటేనుగు కథ

మా రాజునకు లేక లేక యొక్కరితియె కొమారై యుదయించినది. దాని పేరు కౌముది. ఆ చిన్నది మొన్నటి ప్రాతఃకాలమున బల్లకియెక్కి యుద్యానవనమున కరుగుచున్నది. అట్టి సమయమున నుత్తరపు తోటలోనున్న పట్ట పేనుగకు మదముదిగిన నది యొడలెఱుంగక గొలుసులం ద్రెంచుకొని మావటీండ్రజంపి చెట్టుకొమ్మల విరచుచు రౌద్రావేశముతోఁ బట్టణముమీదబడి కనంబడిన జంతువులనెల్లదుండాగ్రంబున మోది జంపుచు గాలంద్రొక్కి రాచుచు జీల్చుచు జనుల జత్రవధ జేయఁదొడంగినది. ప్రజలు హాహాకార నినాదములతో దెసలకుఁ బారదొడంగిరి కొంధరాయుధపాణులై యెదిరించి సదమదము చేయఁబడిరి. కొందరు ప్రాణభీతిఁ జెట్టులెక్కియుఁ గొమ్మలతోఁ గూడ భజింపఁబడిరి. ఈ రీతి నాభద్రదంతావళము వీరభద్రుండువోలె రౌద్రరసంబునఁ బ్రజల మర్థించుచుఁ దసదెస వచ్చుచుండుటంజూచి రాజపుత్రిక పల్లకీ మోచేడి బోయెలు వెఱచుచు మఱలి పట్టణముదెసకు నతివేగముగా బరువెత్తఁ దొడంగిరి.

అంతలో నాదంతావళము తఱముకొని వారిచెంతకు వచ్చుటయు నా