పుట:కాశీమజిలీకథలు -04.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేవగుప్తుని కథ

315

కృష్ణదేవ మహారాజా !

దిగ్దంతులని బిరుదములు వహించిన మీ యాస్థాన కవీశ్వరులీనడుమ మా పురమున కరుదెంచి మా యాస్థానకవి పుత్రుండు దేవగుప్తుండనువానితో బ్రసంగించి యోడిపోయి మఱునాఁడు వత్తుమని చెప్పి యీ యుత్తరమువ్రాసి యంపిరి. అది యిందుతోఁ గూర్చితిమి. అందలి నిజానిజంబు లెట్టివో మాకుఁ దెలియకున్నవి ఏది యెట్లయినం గానిండు. ఇప్పుడు బాలపండితునతో నేవిద్యలోనైనఁ బ్రసంగించి గెలుచు కొనినవానికి మూడు గ్రామములు బారితోషికముగా నిచ్చుచున్నవాఁడ. మునుపు దబ్బరయైనను నిప్పుడు నిక్కముగా మీ పండితులం బంపుదురని నమ్ముచుంటిని.

ఇట్లు మీ విధేయుఁడు

మలయధ్వజుండు.

ఆ యుత్తరమప్పుడే రాయలవారియొద్ద కనిపి యబ్బాలునకు రత్నకట కాంగుళీయాద్యాభరణంబు -లెన్ని యేనిఁ గానుకలిచ్చి వారి యగ్రహారమున కనిపెను. అప్పుడు నేనందుండటచే నా విశేషములన్నియుం జూచితిని. ఈ కళావంతుడా దేవగుప్తునితోఁ బ్రసంగించి గెలిచెనేని నెక్కుడు పాండిత్యముగలవాఁడని చెప్పఁదగినదని యా వృత్తాంత మంతయుం జెప్పుటయు నా బ్రాహ్మణులు హరిశర్మా? రాయలవారి పండితులు వచ్చిరా ? వారితోఁ బ్రసంగించిరా ? పిమ్మట నేమయ్యె నా విశేషములు వక్కాణింపుమని యడిగిన నతం డవ్వలి వృత్తాంతము నాకుఁ దెలియదు అమ్మఱునాఁడే నేనందుండి వచ్చితినని చెప్పెను.

హరిశర్మ చెప్పిన వృత్తాంతమంతయు విని సదాచారి కౌముదిని గెలిచినట్లే కళావంతుండు దేవగుప్తునింగూడ గెలువఁగలఁడని నిశ్చయించి యా మూడుగ్రామములు తనకు దొరకునని నాసతో నప్పుడారాజు పంపిన పదివేలమాడలం గొనక యందే యుంచుమని చెప్పి కళావంతుం దీసికొని మధురాపురంబునకుం బోయెను. మలయధ్వజుండు పండితులు, విద్యావివాదములఁజూడ వేడుకఁగలవాఁడు కావున విద్వాంసులు వచ్చినప్పుడు క్రిందివారు తన కెఱింగింపరని తానువసించు నెలవున నొక గంటఁ గట్టించి దాని త్రాడు సింహద్వారముదాపున వ్రేలాడఁజేసెను. పండితులు కానివారలా గంట లాగిరేనిఁ కఠినముగా శిక్షింపఁబడుదురని ప్రకటన వ్రాయించెను. కళావంతు డెవ్వరినడుగకయే యా ప్రకటనఁ జూచికొని యా త్రాడులాగి దృఢముగా నాగంట మ్రోగించెను. ఆ ధ్వని వినే యాఱేఁడు త్రాడులాగినవానిం దీసికొనిరమ్మని యొక భృత్యునంపుటయు వారిరువురను రాజునొద్దకుఁ దీసికొనిపోయెను.

ఆ యొడయఁ డాపుడమి వేల్పులంజూచి నమస్కరించుచు మీ రెచ్చటి వారలు ఏమిచదివికొనిరని యడిగినఁ గళావంతుఁడు దేవా ! మాది కాశీదేశము నా పేరు కళావంతుఁడండ్రు. ఈయన మాతండ్రి. కుముద్వతీ నగరంబున రాజపుత్రిక చతురంగమాడి తన్ను గెలిచినవానికిఁ బదివేలమాడలు కానుకగా నిత్తునని ప్రకటించిన విని