పుట:కాశీమజిలీకథలు -04.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34

కాశీమజిలీ కథలు

తెఱఁగరయ నియమింపుడు. తెలిసికొని వచ్చినవారికిఁ గానుకలను నిప్పింతుమని చెప్పి యప్పుడే యతండా రహస్యసదనమునకుం జని మంత్రులతో నాలోచించుచుండెను.

అచ్చట వీరుండు గూఢచారులవలన లవంగికతంబున యవను లాదివసంబున సంగరము మానుకొనిరను వార్తవిని సంతసముతో గవనుల రక్షించుకొనుచు నుండుఁడని భటుల రణసన్నాహము మానిపించి యమ్మఱునాఁడు సాయంకాలమునఁ దాను బ్రచ్ఛన్నముగా స్త్రీవేషము వైచికొని ద్వారపాలకురకు వీరుని యానతి నరుగుచున్నదాననని యయ్యుత్తరవుఁ జూపి లవంగి యున్న యంతఃపురమునకుం జనియెను. ఆ మేడకు దూరముననెయుండి యందున్న కుందలతిలకను హస్తసంజ్ఞచేఁ జీరి యొకజాబిచ్చి యచ్చెలువ యొద్ద కనిపెను.

అక్కనకగాత్రి యప్పత్రికం జదువుకొని తలయూచుచుఁ గుందలతికతో సఖీ! వీరుని చెల్లెలఁట. మల్లిక యను చిన్నది మనతో ముచ్చటింప వచ్చినదఁట. రమ్మనుట కేమి యాక్షేపణమున్నది? వారు మన గౌరవము నిలిపిరికాని యవమానపఱచినచో నేమి చేయుదుము? ప్రవేశపెట్టుమని పలికిన నప్పనికత్తియ సత్వరంబునం జని యక్కపటవనితం దీసికొనివచ్చినది. రాజపుత్రిక పదియడుగు లెదురు చని యతనిచేయిఁ బట్టుకొని ముద్దువెట్టుకొనుచుఁ దీసికొనివచ్చి యుచితపీఠంబున గూర్చుండబెట్టి యెక్కుడు సత్కారములం గావించినది. పిమ్మట వారిరువురకు నిట్టి సంభాషణములు జరిగినవి.

లవంగి -- మల్లికా! నీ తలిదండ్రులు నీ రూపమునకుఁ దగినపేరు పెట్టిరి. సంతసించితిని. నీ వేకులముఁ బవిత్రముఁ జేసితివి? నీ తండ్రి పేరెయ్యది? ఆ పన్నిమగ్నురాల నగు నన్నుఁజూడ నీ కేమిటికి వేడుకపుట్టినది.

మల్లిక -- నేను బండితభట్టను బ్రాహ్మణుని కూతుఁరను. వీరుఁడు నాకు సోదరుండు. మా గ్రామ మంతటను నిన్నబ్బురముగాఁ జెప్పుకొనుచుండుటచే జూడ వచ్చితిని.

లవంగి - నన్ను మీ యూరిలో నేమని చెప్పుకొనుచున్నారు?

మల్లిక -- విద్యారూపగుణశీలంబుల ననవద్యవని.

లవంగి — కాదు కాదు. హిందువుల పాలిఁటి మారినని చెప్పుకొనియెదరు. కానిమ్ము కుందలతిలకా! వీరుండన ...

కుం - సందియమేల ? మనలఁ చెఱతెచ్చిన యాతండే.

లవంగి - ఓహో? ఆయన సోదరివా నీవు అట్లయిన మాకు మిత్రకోటిలోనే జేరితివి.

మల్లిక - సందేహమేల అందులకేకాదా చూడవచ్చుట.

లవంగి - (నవ్వుచు) మీ యన్నగా ఠెక్కుడు పండితుఁడుగదా? నీవేమేనం జదివితివా? మీలో నాఁడువారు చదువుదురా?