పుట:కాశీమజిలీకథలు -04.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తుందిలుని కథ

293

నిశ్చయించుచు వసుంధరుఁడు మహాత్ముల ప్రభావమచింత్యముకదా యేమియు నిశ్చయింపరాదని తలంచుచు నతివినయముతో నామహర్షి నాశ్రయించి తిరుగుచుండెను. నాలుగు దినంబులు గడిచినంత వసుంధరుఁడొండొండ నాయతి యంతశ్శక్తి గ్రహించి యతనియందు మొదటఁ గలిగిన భయభక్తి విశ్వాసములు క్షీణదశ నొందుచుండ నొకనాఁడు వేడుకగా మటలాడికొనుచున్న సమయంబున యతీంద్రా ! నేనడిగిన ప్రశ్నమున కుత్తరముఁ జెప్పితిరి కారేమి ? మీ తపంబునకు లోపము వచ్చుననియా యేమీ ? వృత్తాంతము చెప్పినంతనే కొరంతపడు తపంబు రంభాదులు వచ్చి యెదుట నిలిచిన యెట్లు చెడకుండు . నన్నన్యునిగాఁ దలంపక మీ యుదంతము వక్కాణింపుడు విని సంతసించెద. మీ పూర్వాశ్రమ దేశమేది ? అభిధానమేమి ? కులశీలంబులెట్టివని యడిగినఁ దదీయ వచనరచనా చమత్కృతికి లోఁబడి యా తపసి గుట్టువిడిచి తనకథ యిట్లని చెప్పదొడంగెను.

తుందిలునికథ

వత్సా ! నా చరిత్ర గుప్తంబయినను నీయందుఁగల మక్కువచేఁ జెప్పుచుంటి వినుము. నేను దామ్రపర్ణీ తీరంబుననున్న దేవనిలయమను నగ్రహారమున వసించు విష్ణుగుప్తుఁడను బ్రాహ్మణుని యేడవకుమారుండ. నన్నుఁ దుందిఁలుడని పిలుచుచుండిరి. మాయన్న లందఱు వేదశాస్త్రములం జదివికొని రాజసభల కరిగి పెక్కు ధనము సంపాదించుఁకొని మంచికన్యలం బెండ్లియాడి గృహస్త ధర్మముల నెరవేర్చుచుండిరి. నేను బాల్యంబుస నాకతాయితనంబునం బెద్దలమాట వినక బడికి బోవక చదువక నిరక్షరకుడినై కాల్చి విడిచిన యాఁబోతవలెఁ దిరుగుచు నిత్యము శ్రాద్ధంబుల భోక్తగా నిమంత్రితుండనై పొట్టనిండ మెక్కుచుండుకతంబున బలిసి తుందిలాభిధేయంబు సార్థకమునొంద గర్వాభిభూతుండనయి వర్తింపుచుంటిని.

నా తలిదండ్రులు మదీయవిద్యావిహీనతకును బొగరుఁబోతు తనంబునకును వగచుచుఁ గొంతకాలమునకుఁ గాలధర్మము నొందిరి. పిమ్మట నాయన్నలు నాయవివేకమునకుం గినిసి నన్నుఁబరామర్శింపక విడిచిపెట్టిరి. నాయట్టిహీనునికిఁ బిల్ల నెవరిత్తురు? నేను వివాహశూన్యుండనయి యన్నమిడువారు లేమింజేసి నేనాయగ్రహారము విడిచి కొంతకాలము దేశాటనము గావించితిని. నాచూడని పట్టణంబులు, చేరని యరణ్యంబులు కానని తీర్ధము లెందునులేవు. పుడమియంతయు గ్రమఱితిని. ఏ విశేషము గనబడినదికాదు.

శతానందయోగికథ

విను మొకనాఁ డుత్తరకురుదేశంబులఁ దిరుగుచుండ నొక యరణ్యములో నిప్పుడు నావలెనే యొక పరివ్రాజకుఁ డొక్కరుండు పర్ణశాలఁ గట్టికొని వాసముచేయు చుండ దై వికముగా నే నావాసమున కరిగితిని. ఆ యతింజూడ నెనుబదియేండ్ల వయసు