పుట:కాశీమజిలీకథలు -04.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

292

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

అంతలో నతండును స్నానముజేసి యనుష్ఠానము దీర్చుకొని జటాకలాపము ముడివైచికొనుచు నొడలెల్ల విభూతి ప్రామికొని కమండలువున జలంబుబూరించి యవ్వలంజనుచుండెను. వసుంధరుండు వడివడి నడిచి యాజడదారింగలిసికొని యో మునీంద్రాశరణార్థిని రక్షింపుము రక్షింపుమని యతని పాదంబులంబడి నమస్కరించెను.

ఆ యతి హస్తసంజ్ఞచే వారించుచుఁ దనతో రమ్మని సూచించిన లేచి వసుంధరుఁడా మునివెంట నతని పర్ణశాల కరిగెను. ఆ విరాగి యందొక మాకందము నీడఁ గూర్చుండుమని వసుంధరు నియమించి తానాపర్ణకుటీరములోనికిం బోయి యారవైచి యుంచిన వల్కలముదాలిచి యగ్ని దేలిచి యందుఁ గందమూలంబులఁ బచించి యాకుననిడి కొంత యతిధికిచ్చుటయు నతండు మహాత్మా ! వలదు, వలదు. ఇంతకుమున్న ఫలంబులందిని యాకలినడంచుకొంటి. యతిమాత్రసత్కారముతోఁ బనిలేదు. వీని శిష్యునిగాఁ భావింపుఁడని వేడికొనియెను.

తరువాత నాయతి ఫలంబులందిని వార్చి వాకిటకువచ్చియందు వినమ్రుండై యున్న వసుంధరుంజీరి వానితోఁగూడ మందార తరుమూలవేదికం గూర్చుండి స్వాగత పూర్వకముగా నీ వెవ్వఁడవు? ఈ యరణ్యమున కెట్లు వచ్చితివి ? నీ వృత్తాంత మంతయుం జెప్పుమని యడిగిన వసుంధరుఁడు స్వామీ! ఆంధ్రదేశాధినాయకుండగు కృష్ణదేవరాయలవారి యాస్థాన కవీంద్రుండు తెనాలి రామలింగకవి కౌరసపుత్రుండ నా పేరు వసుంధరుడందురు. నేను మందారవల్లియను మా తల్లియొద్ద శుద్ధాంతములో శాస్త్రములం జదువుచు నిన్నరాత్రి బండుకొంటి నింతియ నే నెఱింగినది. నేఁటి యుదయంబున లేచిచూడ నీ మహారణ్యములో నుంటి నిందులకు గారణమేమియం దెలియదు. మీరు సర్వజ్ఞులుగదా ! నా రాకకుఁ గతంబరసి మీరే వక్కాణింపవలయు. మఱియు నిది యేదేశము ఈ పర్వతము పేరేమి ? ఇందుదపంబు గావించుచు నా దురదృష్టదేవతం బారఁదోల ప్రత్యక్షమైన దేవర నామాక్షరంబు లెట్టివో వివరించి నన్నుం గృతార్థుంగావింపఁ బ్రార్ధించుచున్నాడ. నింతదనుక మీరు నాయెడజూపిన యాదరమే నన్నిట్లు వాచాలుని జేయుచున్నది పరిచయము గొంచమైనను నధికపకృతులకుఁ ప్రగల్భము గలుగఁజేయునుగదా, యని యత్యంత వినయానుబంధపూర్వకముగా నడిగిన మందహాసము గావింపుచు నా బైరాగి యిట్లనియె

వత్సా ! నీవు బాలుండవైనను బ్రకర్షవచనంబులచే నీ యెంతస్సారంబు దెలియఁ జేసితివి. నీ పాండిత్యమునకు సంతసించితిమి. నీయందు మాకక్కటికము కలిగినది. నీ యాగమంబునకుఁ గారణంబు యోగదృష్ఠింజూచి ముందు వక్కాణించెద నిన్ను మీ బంధువులం జేర్చుటకేనపూట. నీవు విచారింపకుము. నాయొద్దఁ గొన్ని దినంబులుండుము. నీకు మంచి మత్రంబు లుపదేశించెదనని తన వృత్తాంత మేమియుం జెప్పక యప్పుడు వేరొక ప్రస్తావము దెచ్చెను.

తదీయవచనోపన్యాసము విని యతని కేమియుఁ బాండిత్యము లేదని