పుట:కాశీమజిలీకథలు -04.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వసుంధరుని కథ

291

విద్యాన్మాలయను యక్షిణి మంత్రబద్దయై వసుంధరుని నెత్తుకొనిపోయి యొక కొండశిఖరమునంబెట్టి యరిగినది. అతండు వాడుక ప్రకారము వేకువజామున లేచి పుస్తకము తడవుకొనుచు నేమియుం గనంబడమి వెఱగుపడి అమ్మా ! అమ్మా ! యని పిలిచెను. ప్రతివచనము వినఁబడినదికాదు. సంశయాకులితమతియై నలుమూలలు చూచి యంతలోఁ దెల్లవారుచున్నది. కావున వృక్షలతా గుల్మాదులు గనంబడిన విభ్రాంతినొందుచు నది స్వప్నమనుకొని కన్నులు మూసి యొక్కింతతడవు పండు కొనియెను.

అందు కఠినశిలాతల సంపర్కంబు గాత్రంబు నొవ్వ నయ్యో యిది మదీయమృదుతల్ప మింతకర్కశముగానున్నదే. మంచమునుండి క్రిందఁబడితినాయని ధ్యానించుచుఁ గన్నులందెరచిచూడ మహారణ్యము గనంబడినది. అప్పటికి రవికిరణంబులు కొన్ని నభంబునం బ్రాకినవి.

వసుంధరుం డప్పుడు మోహవిజండై తానున్న నేలయుఁ దన శరీరము తన దుస్తులను బలుమారు జూచుకొనుచు విస్మయం బభినయించుచుఁ బెద్దతడవు చింతా సముద్ర కల్లోలడోలికల నూగుచు నేదియు నిశ్చయింపనేరక యెట్ల యిన లెస్సయేయని ధైర్యమూని లేచి యా ప్రాంతమందున్న యొకమఱ్ఱిచెట్టెక్కి నాలుగుదెసలు పరికించెను. ఎటుచూచినను మహారణ్యమేకాని యెందును దెరపి కనంబడినదికాదు.

ఒక దెసదాపుగనే జలపక్షు లెగురుచుండుటచూచి యతండా మ్రానుదిగి యావంకకుఁ బోయెను. అందొక తామరకొలను వానికి నేత్రపర్వము గావించినది. దానికి నలుచక్కి చక్కని సోపానములు గట్టబడియున్నవి. బహువిధ వర్ణములఁ బొలుపొందు జలబముల గదలింపుచు గంధవహుండు మేనికి హాయిసేయ హంస ప్రముఖ జలవికిర నికరంబులు చెవులపండువగుచుండఁ దీరతరుశ్రేణీ విరాజితమై యొప్పారు నాకాసారము హృదయంగమంబై యంతకుముందు బొడమినచింత మఱుపు సేయ వసుంధరుం డందలి వృక్షంబుల మధుర ఫలంబులఁదిని యాసరసిజలంబులం గ్రోలి యాఁకలినడంచికొని భూరిత రుచ్ఛాయాభిరామంబులగు తీరసోపానములం గూర్చుండి తనరాక గుఱించి చింతించుచుండెను.

పరివ్రాజకునికథ

అప్పు డవ్వలితీరమున నొకపరివ్రాజకుఁడు స్నానము చేయుచున్నట్లు కనంబడెను. ఆ సన్యాసింజూచి వసుంధరుండు పరమానందముఁ జెందుచు నో----- ఇది తపోవనముఁబోలు. మహార్షులీ తటాకమునఁ దీర్దము లాడవచ్చుచున్నట్లు పొడకట్టుచున్నది. కానిచో నీభూమి యింత రమ్యముగా నుండునా ? ఆ మహానుభావుని గలసి నా వృత్తాంతం బడిగెదగాక యని నిశ్చయించి లేచి యల్లన లతాగుల్మాదులం దప్పించుకొనుచు నా ఋషియొద్ద కరిగెను.