పుట:కాశీమజిలీకథలు -04.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

290

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

తల్లీ ! దైవముతోడు నే నేమియు నెఱుంగను. మా శిష్యుఁడు తీసికొనివచ్చి యీ కాగితమే నాకిచ్చెను. ఇందలిపేరే నేను జపించితిని నిదియే నిక్కువమని యతం డనేక ప్రమాణములు చేసెను. అప్పుడాశిష్యు నందు రప్పించి నిర్బంధించి యడిగిన వాఁడు భయపడి యధార్థము చెప్పెను. పత్రికా వినిమయ మప్పుడు జరిగినదని నిశ్చయించి యా పల్ల విక యా మాంత్రికుని మఱల నబ్బాలిక నిచ్చటికి రప్పింప వలయునని కోరినది.

అప్పుడతం డమ్మా ! యిది దైవికముగా జరిగినది. దీనికి నేనేమి చేయుదును. ఆఱుమాసములదనుక మఱల నే నా జపము చేయరాదు. చేసినను యక్షిణి ప్రత్యక్షముగాదు. అదియునుం గాక మా దేవతకు దేనినైన దూరముగాఁ దీసికొని పారవేయుటకేకాని దూరమునుండి తీసికొనివచ్చు సామర్థ్యములేదు. మఱియు నబ్బాల యెందు పడినదో యాఱుమాసము లరిగినగాని యిప్పుడు తెలిసికొనఁజాలను. అక్కటా ! దైవ మెట్టియిక్కట్లు తెచ్చిపెట్టెనోగదా వీరభటులంబంపి వెదకింపవలయునని యతం డత్యంతసాధ్వని శోకకంపితచిత్తుండై నుడివెను.

గీ. ఒరుల కలిమిజూచి . యోర్వలేక జనుండు
   కీడుసేయఁ దనకె . మూఁడు నెపుడు
   మింటిశోభ సైప . మితి రాయి ఱువ్వెన
   శిరముమీదఁబడి న . శించుగాదె.

ఆ మాంత్రికుని మాటలు విని పల్ల విక తల్లడిల్లుచుఁబోయి యా వృత్తాంత మంతయుం గళానిలయ కెఱింగించినది. ఆమెయు నురముబాదికొనుచు దైవమును దూరుచు భూసురుం దిట్టుచుఁ బెద్దయెలుంగున నేడువఁదొడంగినది. శోకేద్రేకము వివేకమును మట్టుపఱచునుగదా. అట్లు పెద్దతడవు వాపోవుచు నా పూఁబోడి పల్ల వికచే నూరడింపబడి రహస్యభేముగాకుండ యక్షిణి పుత్రిక నెత్తుకొని పోయినదని యుచ్చరించుచు నావార్త రాయలవారి కెఱింగించినది.

ఆ వార్త విని యా భూభర్త యాశ్చర్యశోకసంభ్రమంబులు చిత్తంబుత్తలపెట్ట నతఃపురంబున కరిగి కళానిలయ నూరడించుచుఁ బుత్రికా వృత్తాంతము దెలిసికొనుటకై పెక్కండ్ర వీరభటుల నాలుగు దెసలకుం బంపెను.

కళానిలయయు నంతఃపురమునం దనయావియోగశోకాగ్నిం బొగులుచు శాత్రవోచ్ర్ఛయము సహింపక యాఱుమాసములు గతించిన పిమ్మట మఱల రహస్యముగా నా సోమశేఖరుని రప్పించి కొమార్తెజాడ నడుగక యీ తేప శత్రుందప్పక పరిభవింపవలయునని పలుకుచున్నప్పుడే "మందారవల్లి కొడుకు వసుంధరుఁడని" తానే వ్రాసియిచ్చి కానుకలతోఁగూడ ననిపినది. ఆమాంత్రికుఁ డింటికిం జని వెండియు, దీక్షగైకొని హోమముచేయుచు దీక్షావసానంబున వసుంధరుని నడవిపాలగునటులు చేసెను. ధనపిశాచగ్రస్తులకుఁ గార్యాకార్య వివేచన ముండదుగదా !