పుట:కాశీమజిలీకథలు -04.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వసుంధరుని కథ

283

వసుం - అట్ల యిన వినుము. లోకమునఁ దొలిప్రాయమున నున్న సుందర పురుషుని యువతి మోహించినదని వర్ణించిన యుక్తముగా నుండును. శాకుంతలమునఁ బెక్కండ్ర భార్యలం బెండ్లియాడి యౌవనమంతయు గొల్ల పెట్టి వయసు మీరిన దుష్యంతుని నాయకునిగాఁజేసి నిరుపమాన కళాసౌందర్యాతిశయంబునం బొలు పొందు శకుంతలచే వరింపఁబడినట్లు రసపుష్టి చేసి వర్ణించెను.

కళా - తరువాత?

వసుం - మాళవికాగ్నిమిత్ర నాటకమునఁ దానదివఱ కిరువుర భార్యలం బెండ్లి యాడి సంతానము గని కాలము గడచిన యగ్నిమిత్రుని నాయకునిగాఁ జేసి యతని పెద్ద భార్య యొద్దఁబరిచారికగానున్న మాళవికను వరింపజేసి శృంగారసము వెల్ల విరియునట్లు వర్ణించెను. అట్టివానిం జూచి ద్రవ్యమున కాసపడి నారకాంతవరింపవలయుం గాని తరుణి యెవ్వతెయు మోహింపదు. అయ్యో ! యింత కన్న ననౌచిత్య మెందైనంగలదా ? రాజులు పరిచారిక లెంత సుందరులై నం గన్నెత్తి చూతురా ? అట్టివారి వరించిరని వినినంతనే కటువుగా నున్నదియే. రాజుల కా యపఖ్యాతియేకదా యిప్పటికి బాధించుచున్నది మఱియు విక్రమోర్వశీయమున వర్ణింపఁ బడిన విక్రముడెన్ని యేండ్లవాఁడో నీవే చెప్పుము. వృద్ధుల రసికులం జేసి రసపుష్టి లేకున్ననుం దెచ్చి పెట్టి వర్ణించుచు మహాకవియని పేరు పొందిన కాళిదాసు మూఁడు నాటకములను బాడుజేసె నీ మాఱైన లోపము తెలిసినదా ?

కళా - (తల్లి వంక చూచుచున్నది.)

కళానిలయ - ఏమి బాలకా ! నీ సాహసము. రామలింగ కవి పుత్రుఁడవు కాబట్టి యా మహాకవులనే యాక్షేపించుచున్నావు. శకుంతల దుష్యంతుని వరించి నట్లును ఊర్వశి విక్రముని వరించినట్లును బురాణములలో నున్నది నీ వెఱుంగవు కాఁబోలు ఆ తప్పు కాళిదాసునిది కాదు. వ్యాసునిది. ఆక్షేపించిన నతని నాక్షేపింపుము మఱియు మాళవిక పరిచారిక కాదు. రాజపుత్రికయైనట్లు నీ వెరింగిన నిట్లాక్షేపింపవు.

పసుం - ఓహో ? నీవే కాఁబోలు నీ బాలికకు విద్యగరపితివి. నీకే తెలియనిదే యా బాలిక బెట్లు తెలియును ?

కళానిలయ - డింభకా ! మాటలు పెక్కు నేరిచితివిలే నాకుఁ దెలియనిది నీకుఁ దెలిసినదేదియో చెప్పుము.

వసుం - ఇఁకజెప్పినం దెలియదు. వ్యాసునితప్పేది యున్నది ? పురాణములలో నట్లుండవచ్చును. అట్టి కథల నేరి కాళిదాసు నీ నాటకముల నెవ్వురు రచింపుమని బ్రతిమాలిరి ? మంచి కథలే రచింపరాదా ?

శ్లో॥ అనుకూలౌనిషేవేతే య త్రాన్యోన్యం విలాసినౌ
     దర్శనస్పర్శనాదీనిసంభోగోయముదాహృతః॥

సమమైన ప్రాయముగల విలాసవంతులు, దర్శన స్పర్శనాది రూపమైన