పుట:కాశీమజిలీకథలు -04.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

282

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

డరు దెంచెను. వాని మొగము చంద్రబింబము వలె వట్రువై కళలు గలిగి ముద్దులు గులుకుచున్నది. కన్నులు తామర రేకులవలె సోగలై చెవులవఱకు వ్యాపించియున్న వి. చెక్కులయందము నొసటిసారు పలు వరుస తీరు చూచి తీరవలయు నొడలిరంగు కుందనమే యనందగి యున్నది. అట్టి యర్భకుం డరుదెంచి అమ్మా ! నన్నే మిటికిఁ బిలిచితివి నా చదువున కంతరాయము గలుగజేయఁ దగినంత పనియేమి వచ్చినదని యడిగిన మందారవల్లి పట్టీ ! యీ రాచపట్టి గట్టిగఁ గావ్యనాటకాలంకార గ్రంథములం జదివినఁదట. ఆ బాలికం బరీక్షింపు మిందులకే పిలిచితినని పలికిన నా మాణవకుం డా బాలికతో నిట్లు ప్రసంగము గావించెను.

వసుంధరుఁడు - బాలా ! నీ పేరేమి ?

కళావతి - నా పేరు కళావతి యండ్రు.

వసుం - నీ వేమి చదివితివి?

క - కావ్యములు నాటకములు నలంకార గ్రంథములు లక్షణ గ్రంథములు చదివితిని.

వసుం - నాటకములన్నియుం జదివితివా ?

క - ప్రసిద్ధములైన వన్నియుం జదివితిని.

వసుం - యెవరి యొద్ద ?

క - మా తల్లి యొద్దనే.

వసుం - శాకుంతలము మాళవికాగ్ని మిత్రము విక్రమోర్వశీ యమను నాటకముల మూటిని నెవ్వరు రచించిరి ?

క - మహాకవి కాళిదాసు.

వసుం - అందలి కథానాయకుల యందుగల లోపమేమియో చెప్పఁగలవా ?

క - లోపమేమి యున్నది ? వారు దక్షిణనాయకులు నాయక లక్షణము లన్నియు వారియందుఁ బూర్ణముగా నున్నవిగదా ?

వసుం - వారు దక్షిణనాయకులో పశ్చిమనాయకులో తరువాతవిమర్శింతము. వారి లక్షణముల కేమిలోపములేదు . ఉన్నదొక్కటియే లోపము.

కళా - అదియేమియో నాకుఁ దెలియదు.

వసుం - ఇంతియేనా నీ చదువు ? ఈ పాటిదానికే పరీక్ష. ?

కళా - మహాకవి కాళిదాసునకుఁ దప్పులు పట్టెదమా యేమి?

వసుం - కాళిదాసైననేమి తప్పులు గలిగినఁ జూపకుందుమా ?

కళా -- అ కొరంత యేదియో నీవే చెప్పుము.

వసుం - ఎల్లరకుం దెల్లమైనదే ! వేర చెప్పవలయునా ?

కళా - మాకుఁ దెలియలేదు. చెప్పుము.