పుట:కాశీమజిలీకథలు -04.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

280

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

జెప్పెదన" నుటయు వాఁడు సత్వరంబునం గుడిచి యాసిద్ధునొద్దకరిగి యల్లన నిట్లనియె.

తండ్రీ ! కృష్ణదేవరాయల భార్య కళానిలయము రామలింగకవి భార్య మందారవల్లి యు మహావిద్వాంసురాండ్రని మీ రిదివరకు నుడివిని కథలవలనఁ దెల్లమగుచున్నది గదా వారిద్దరిలో నేముద్దియ బుద్దిమంతురాలు ? మందారవల్లి వాదింపవచ్చినప్పు డప్పడఁతిమాట యేమియుం జెప్పితిరికారేమి ? మఱియు వారిరువురు నొక్కవీదియందే యుండిరికదా. తరువాత నెప్పుడైనం వారికి బ్రసంగములు జరిగినవియా ? తారతమ్యంబు లెవ్వరైన నిరూపించనారా ? యా వృత్తాంతమరసి యానతీయుఁడు వినఁ గుతూహలమయ్యెనని వేడిన నప్పండితుండు సంతసించుచు మణిమ్రోలనిడికొని యా యుదంతమరసి శిరఃకంపము చేయుచు నోరీ! నీయందేదియా యద్భుతశక్తి యున్నదిసుమీ ! నీవడిగిన విషయ మూరకపోవదు. అందుఁ బెద్ద వృత్తాంతము గలిగియుండెడిది. ఇప్పటి నీ ప్రశ్నమువలన మంచికథ దెలియబడు చున్నది. వినుమని యిట్లు చెప్పం దొడంగెను.

కళా నిలయ కథ

మందారవల్లి రాయలవారి యాస్థాన కవులతోఁ బ్రసంగించునప్పుడు --- నియల పుట్టినింటి కరుగుటచే నాఁబోఁటి లో ప్రస్తావింప నవసరము లేకపోయినది. మందారవల్లి రామలింగకవిం బెండ్లి యాడి రాయలవారి వీటిలో నుద్యానవనములోఁ గట్టింపఁబడిన దివ్యసౌధంబున వసించి విద్యావ్యాసంగము చేయుచుండెను. ఆ వనితకుఁ గావలసిన ద్రవ్యము ఢిల్లీనుండి తండ్రియే పంపుచుండెను.

కళానిలయ పుట్టినింటనుండి వచ్చినతరువాత మందారవల్లి వృత్తాంత మంతయు విని యొకనాఁడు రాయలవారితో నిట్లనియె. మనోహరా ! నేను లేనప్పుడు మనవీటికి మందారవల్లి యను వేశ్యాంగన యార్తువచ్చి మన పండితులనందఱఁ గాందిశీకులం జేసినదఁట. రామలింగకవి కపటంబున దానింబరిభవించెనని వింటిమి. అది యిప్పుడు మనవీటఁ దోటలో నిల్లుకట్టుకొని యున్నదఁటకాదా ? దాని నొకసారి నా యొద్దకు రప్పించెదరా ? పాండిత్య మేపాటిదియో చూచెదం గాక యని సావలేపముగా బలికిన నవ్వుచు రాయలవా రిట్లనిరి.

మదవతీ ! యా చిన్నది వేశ్యాంగనకాదు. క్షత్రియ కన్యక రామలింగకవిం బెండ్లి యాడినది. దానంజేసి మనవీటిలో నున్నది. మనకు పూజ్యురాలు నీవాకలికిఁ గుఱించి చులకనగా బలుకుచుంటివి. సరస్వతియైన నాయువతితోఁ బ్రసంగింపజాలదు. మన రామలింగకవి కపటముననే యోడించెను. మఱియు నత్తరుణి తండ్రి మా కెల్లరకు నేలుగడ పాదుషా యొద్ద ప్రధానమంత్రియై యున్న వాఁడు దానంజేసి మన మామెను మనయింటికి రప్పించుకొనరాదు. ఆ చేడియం జూడవలయునను వేడుక