పుట:కాశీమజిలీకథలు -04.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

278

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

పతిచే శిక్షింపఁబడిఁ యిక్కడికి వచ్చినది. ఇది తత్సఖురాలు తిలక; మీ చరిత్రము దేవలోకమున సైతము వ్యాపించుయున్నదని నారదుండెఱింగించిన ప్రకారము దేవ దూత వారి చారిత్రమంతయు నుగ్గడించెను.

ఆ వృత్తాంతము విని యెల్లరు ప్రహర్ష సాగరమున మునింగియుండ బురుషవేషముతోనున్న లలిత దిగ్గునలేచి యవ్వలికిం బోయినది. పుష్పహాసుఁడు పురుషవేషము ప్రకటింపుచుఁ దల్లి దండ్రులకు నమస్కరించుచు ఆహా ! దైవమొక యైంద్రజాలికుండై జనుల బొమ్మలవలె నాడించుచుండును. అది యెఱుంగక మానవులు స్వప్రయోజకత్వము ప్రకటింపుచు సుఖదుఃఖముల నొందుచుందురు. ఉపిరి విడుచుటకై న వీరికి స్వతంత్రములేదు. సర్వము దైవాధీనము. అంతయు నాశ్చర్యకరమైనదే యని పలుకుచుఁ దిలకచేసిన పనులన్నియు నుగ్గడించి తదీయ సాధుమేధకు మిగుల నానందించెను. తల్లి దండ్రు లతని బెద్దయు బ్రొద్దు గ్రుచ్చియెత్తి ముద్దాడిరి. మఱల నొండొరులు పడిన యిడుమల నొండొరుల కెఱింగించుకొని విస్మయ శోకంబు నభినయించిరి.

అప్పుడు దేవదూత అయ్యా ! మీరీ మంచముపై గూర్చుండుఁడు. మీ పట్టణంబునకుం దీసికొనిపోయెద నిది కబేరుని శాపమని పలికిన విని సంతసించుచు రత్నకుండలుఁడు సుల్తానునకుఁ దమ వృత్తాంతమంతయు జెప్పి యందున్న యపరాథులనెల్ల స్వేచ్ఛగ దిరుగ విడిపించి వజ్రమాలనుఁ దల్లితోఁగూడ నోడయెక్కించి భర్తనొద్దకనిపి తన కుటుంబముతో నా మంచముపైఁ గూర్చుండెను. అప్పుడు గోవిందుఁడను బ్రహ్మచారి దీనవదనుండై చూచుచుండ లలిత తన కపటంబుననే వానికీశిక్ష కలిగినదని యా కథఁ జెప్పుచు నాతినిగూడ మంచముపై నెక్కించుమని మామగారికిఁ దెలియఁజేసిన నతడంగీకరించెను

అట్లు వారందఱుఁ గూర్చుండి యిష్టలాపము లాడుచుండ దేవదూత మంచముశిరంబునఁ నిడికొని ద్రొణగిరిదాల్చిన హనుమంతుడువోలె నతిరయంబున వింధ్యకూట నగరాభిముఖుండై యరుగుచున్న వాడు గోపా ! తదీయచ్ఛాయయే నీకు గనంబడినది. తెలిసినదా ? యని పలికినవిని యా గోపకుమారుండు సంతోషించుచు మహాత్మా ! మీ యక్కటికంబు గలుగ నేమిటికి దెలియదు. వారి భవిషవృత్తాంతము గూడఁ గొంచెము చెప్పి మీ శిష్యునిఁ గృతార్థుంజేయుఁడని వేడికొనిన నవ్వుచు నయ్యతి పుంగవుం డిట్లనియె.

విను మట్లా దేవదూత యాకాశగమనమున వింధ్యకూటనగరమున కరిగి వారి యంతఃపురమున వెనుకటి యుప్పరిగపయి నా మంచమును దింపి యవ్వార్త యందున్న రాజునకుం దెలియఁజేయుటయు నానృపుఁడు తదాగమనముకు మిక్కిలి యభినందింపుచు నప్పుడే యా రాజ్యమతని యధీనము జేసెను. ప్రకృతివర్గము వారి రాక విని వానరాశియుంబోలె నుప్పొంగుచు హల్లకల్లోలముగాఁ బ్రశంసింపఁజొచ్చెను.