పుట:కాశీమజిలీకథలు -04.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

కాశీమజిలీ కథలు

కృత్యమని చెప్పినది. ఆ మాట విని యప్పాటలగంధి వీరున కేమి యపాయము గలుగునోయని వెఱచుచు నిష్టదైవమును బ్రార్దింపఁ దొడంగినది.

అంత నమ్మరునాఁడు సాయంకాలమునకు విశేషబలముతో వజీరువచ్చి హుస్సేనుబాదులోఁ బ్రవేశించెను. వజీరు రాకవిని కాశీపురములోని మసీదుఫకీరు లాతనిం జూడబోయిరి. మంత్రిగారిని గౌరవించి కుశలప్రశ్నానంతరమున నిచ్చటి హిందువు లింత కావరించియున్నా రేమి? పాదుషా శాసనమంత నవ్వులాటగా నున్నదా? కాశీపురముం ద్రవించి గంగలోఁ గలిపింతు జూడుఁడు. వీ రెవ్వరియూత నిట్టిపని కుద్యోగించిరి. వీరిబలము లెట్టివని యడిగిన ఫకీరు లిట్లనిరి కాశీరాజు మీకు వెఱచి సహాయము రానని చెప్పెను. ఈ దేశమున కెల్ల నాలింగము ప్రాణమువంటిది కావున హిందువులందఱు నేకమైరి.

కాశీరాజు సమ్మతిలేకయే తదీయసైన్యమంతయు వచ్చి యప్పురిఁ గాచుచున్నది. హిందువులు స్త్రీబాలవృధ్ధముగాఁ బోరుటకుఁ సిద్ధముగా నున్నవారు. ప్రాణములఁ దృణముగాఁ జూచుచున్నారు. ఒకరి ప్రోత్సాహము వీరికిలేదు. అందఱు వీరులుగానేయున్నారని యతండు వెఱచునట్లు వీరునందుగల యభిమానమునం జేసి చెప్పిరి. ఆమాటలువిని మీసములు దువ్వుచు నాహా? మేకపిల్లల కెంతక్రొవ్వు వచ్చినది. కానిండు. గొఱ్రె బలిసిన గొల్లకు లాభమేకదా? అక్కాఫరుల పచ్చినెత్తురులు త్రావి తురకలు మత్తులై నాట్యములు సేయగలరు మీరేచూతురుగాక యని పలుకుచు నప్పుడు యుద్ధమున కుత్తురువీయక యీదినంబునఁ గొన్నిసన్నాహములు గావించుకొనిపోయెను.

ఫకీరులు కొంతసే పందుండి యచ్చటిరహస్యము లన్నియుం దెలిసికొని ప్రోలికింజని వీరునితో రహస్యముగా నిట్లనిరి. అప్పా! మా చెప్పిని మాటల వింటివి కావు. ఇప్పుడు పాదుషాగారి మంత్రి మితిలేని బలముతో వచ్చి యున్నాఁడు. ఎల్లుండి యుదయమున నువ్వెత్తుగా మీపురిపైఁబడుదురట. రేపు ప్రొద్దున పాదుషాగారి పుత్రికను ఢిల్లీకి బంపివేయును. అచిన్నది యిక్కడనే యుండెదనని చెప్పి పెద్దతడవు పోవుటకు సమ్మతించినదికాదు. పెద్దయుద్ధము జరుగును. గావున స్త్రీ లిందుండరాదని చెప్పి యెట్టకేలకు బయనమునకు సమ్మతింపఁజేసెను. సామాన్యసైన్యమును సహాయముగా నిచ్చి పల్లకీమీఁదఁ బంపుదురఁట. ఇవియే యచ్చటి విశేషములు. తరువాత కృత్యములు నీవే యోజించుకొనుమని చెప్పి వారు మసీదునకుం బోయిరి. వీరుం డాత్మగతంబున నూహించుకొని యమ్మఱునాడు కొందఱు రాజభటులు సహాయముగాఁ గొని రహస్యముగాఁ జని లవంగి యరుగు తెరువుఁ గాచుకొనియుండెను.

అంతలో నాకాంతారత్నము పల్లకీబోయెల కంఠధ్వనులు వినంబడినవి. అప్పుడు వీరుండు సారంగములఁ దోలు బెబ్బులివలె గుఱ్ఱముతో నెగసి యవనులబలములం బాఱఁజిమ్మి యిరుగడ దండులఁ బట్టికొని పరుగిడు చెలికత్తెలతోఁ గూడి యప్పల్లకి మరలించి మాఱుత్రోవం గాశీపురంబునకుం దీసికొనిపోయి యంతకుమున్న