పుట:కాశీమజిలీకథలు -04.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేవదూత కథ

275

ఇది నీ భార్య గంధర్వదత్త; అది నీ కోఁడలు లలిత; నేనే మీకీ వియోగము గలుగఁజేసిన దుర్మార్గుండని పలుకుచు వారి మ్రోల నిలువంబడియెను.

ఎల్లరు చూచి విస్మయం బభినయించుచున్నారు. అప్పుడు వరుణదత్తుఁడు దేవదూతకు నమస్కరించుచు "నార్యా  ! నీ వెవ్వఁడవు ? మే మల్లనాఁడు మేడమీఁద బండుకొన్న మంచమిది కాదా ? ఇది మీ యొద్దకు కెట్లు వచ్చినది. మా వియోగమునకుఁ గారణుఁడనేనని పలికితిరి. అది యెట్లొ వక్కాణింపుఁడని" యడిగిన దేవదూత యిట్లనియె.

దేవదూతకథ

అలకాపురములో నూరేండ్ల కొకసారి నిథి పూజామహోత్సవము జరుగు చుండును. ఆ యుత్సవమునకు ఇంద్రుడు జయంతుఁడు ముప్పదిమూడుకోట్ల దేవతలు దిక్పాలురు సిద్ధులు సాధ్యులు విద్యాధరులు గంధర్వులులోనగు వేల్పులెల్ల భార్యలతోఁ జనుదెంతురు. మహర్షులు పెక్కండ్రు వత్తురు అచ్చర లెల్ల వచ్చి నాట్యము సేయుదురు. తుంబురు ప్రముఖ గాయకులు సంగీతము పాడుదురు. మునులు ప్రసంగములు చేయుదురు. పెక్కులేల త్రిమూర్తులుఁ దక్క తక్కిన దేవలోకములన్నియు నచ్చటికి వచ్చి యయ్యుత్సవము జూచి యానందించును. అప్పుడు నవనిధులకుఁ గుబేరుండు భార్యాయుక్తుండై పదిదినము లహోరాత్రము లేకరీతిఁ బూజగావింపుచుండును.

అప్పుడు నలకూబరుండు ఆయా బూలోకంబులనుండి వచ్చిన చక్కఁ దనమునం బ్రసిద్దికెక్కిన మిధునంబులనేరి వేఱు వేరున గూర్చుండబెట్టి వారి వారి సౌందర్యాతిశయంబుల తారతమ్యముల వక్కాణింపుఁడని మహర్షులను దేవతలను బ్రార్దింపుచుండును. ఇది వఱకు జరిగిన సభలలో నలకూబరుండును, జయంతుఁడును మొదటివారు గాను జంద్రుండు వసంతుండును, రెండవ వారుగాను అశ్వినీ దేవతలు మూడవ వారుగాను పరీక్షకులచే నిరూపింపఁబడిరి. మన్మధుండు రూపము లేనివాడగుట నేయంతరములోఁ జేరఁడని కొందఱు, చేర్చితిమేని మొదటవానిగాఁ జేర్పవలయునని కొందఱు వాదించిరి.

దానంగాదే సుందరుల వర్ణించునప్పుడు వారినే యుపమాన భూతులుగాఁ జెప్పచుందురు : మఱికొన్ని యంతరములు నిరూపించబడినవి కాని వారిం బేర్కొన నేల? వినుండు. ఈ నడుమ జరిగెడు నుత్సవమునకుఁ బూర్వమొకనాఁడు మా స్వామియైన కుబేరుఁడు మిత్రులతో నుత్సవగోష్ఠి గావింపుచు భూలోకంబునం గూడఁ జక్కదనంబునఁ బ్రసిద్ధి కెక్కినవారు బెక్కండ్రు గలిగియుందురు : మన యుత్సవమునకు వారింగూడ రప్పించిన యుక్తముగా నుండునని యాలోచించి నన్ను బిలిచి యోరీ ! నీవు పుడమి యంతయుం దిరిగి సౌందర్యాతిశయంబునఁ బొగడఁదగిన యొక మిధునము నీ యుత్సవమునకు దీసికొనిరమ్ముఁ వారికి మనోహరుండగు కొమరుండు