పుట:కాశీమజిలీకథలు -04.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

270

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

అప్పుడు సుల్తాను తన కులాచార ప్రకారము గాజుపూసనొక దానిని పెండ్లి కూఁతురు మెడలోఁ గట్టెను. పిమ్మట నా దంపతుల దివ్యాలంకార శోభితంబగు కేళీమందిరములోఁ బ్రవేశ పెట్టి యెల్లరు వోయిరి. ఆ మందిరమునకు నూఱు గజముల దూరములో నితరులెవ్వరు నుండగూడదని సుల్తానుగా రాజ్ఞాపించియున్నారు. ఆప్తు లందఱు దూరముగానున్న గదులలోనికింబోయి పండుకొనిరి.

సుల్తాను తలవంచుకొని యొకమూల నిలిచియున్న పెండ్లి కూఁతురు చేయి పట్టుకొని తల్పము దాపునకుఁ దీసికొనిపోయి కుడిచేతితో మోమించుక యెత్తుచు వోమోహనాంగీ ! నిన్నుఁ జూచినది మొదలీ సుల్తానుపడిన పరితాపము దేవుఁ డెఱుంగును. నే నింతకుమున్ను పెక్కండ్ర యువతులం బెండ్లి యాడితినిగాని వారిలో నొక్కరితయు నీవలె నామది నాకర్షింపలేదు. నీయధరసుధారసంబించుకఁ గ్రోల నిచ్చితివేని నాపరితాపము చల్లారగలదు. అని యనేక ప్రకారంబులఁ గ్రీడాభిరతుండై సంభాషించిన నవ్వుచు నక్కపటచపలాక్షి యిట్ల నియే.

మహారాజా ! నీవంటి మనోహరుండు నామనోహరుండై నప్పుడు నాకుఁ గల సంతోషము శచీదేవికి లేదని చెప్పగలను. దీని కొక యంతరాయము గలుగు చున్నదని దేవరకు విన్నవింపఁ గొంకుచున్నాను. నామనోహరుం డెప్పుడునన్నా వేశించి యుండును. అతండు మిగుల బలవంతుండు. ఇది యపరాధముగా గణించి యలిగి మీకేదియైన పరాభవము గావించునని వెఱచుచున్నాను. ఇంతకన్న యంకిలి యేమియు లేదని పలికిన నతండు శబాసు నీపతినన్నుఁ జక్రవర్తి యని యెఱుఁగడా ? యెద్దియేని కోరిక యుండిన గోరుమనుము. సంతస పెట్టెద నింతియకాక నాకపకారము సేయ బ్రహ్మకు శక్యమా యని సావలేపముగాఁ బలికి యక్కలికిం గౌఁగిలింప వచ్చెను.

సంవర్తసమయ స్ఫూర్ణద్గర్జారోవంబువోలె నాభీలసింహనాదంబు గావించి గిరగిర వలయా కారముఁ దిరిగి యాసందడిలోఁ బై గప్పి కొనియున్న చేలంబుఁ బార వైచి యతండు పురుషవేషంబు గాన్పింప నోరీ ? మ్లేచ్ఛకులాధమా ! నాభార్యబట్ట గమకింతువే ? నిన్నిప్పుడే కృతాంతపురి కతిధిగానంపెదఁ జూడుమని పండ్లు పటపట గీడుచుఁ గిరీటంబు నేలంబడదన్ని శార్దూలంబు వృషభంబునుంబోలె నెడమచేత గుత్తుక గట్టిగఁబట్టుకొని పడవైచి రెండవచేత ఖడ్గంబుబూని వేయనుంకించుచు నిన్ను జంపుచుంటి నీయభీష్టదేవతల స్మరించుకొనుమని పలికెను. అప్పుడా సుల్తాను తల చిదిమిన పామువలె కాలు సేతులఁ గొట్టుకొనుచుఁ గుత్తుక దప్పించుకొను పాటవములేక నిస్సారుండై యోమహాపురుషవర్యా ! నీకు సలాము చేయుచున్నాను.

నన్ను విడిచిపెట్టుము. నీభార్య జోలికిరాను. ఎప్పటిచోట నప్పగించెదఁ బెక్కుకానుక లిచ్చెద నాకుఁ బ్రాణదానము చేయుము. నీ పెండ్లాము చెప్పినను సమ్మతించితినికాను. మంచి ప్రాయశ్చిత్తమైనది. బ్రతికినన్నాళ్ళు నీ పేరు తలంచుకొను