పుట:కాశీమజిలీకథలు -04.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుల్తానుగారి కథ

269

మెరుంగక పౌరోహిత్యము సేసికొనుచు గాలము గడుపుచున్న మా యింటికివచ్చి యా చిన్నదే యీ ముప్పు దెచ్చి పెట్టినది. యింతకన్న నేనేమియు నెఱుఁగనని పలుకుచుఁ గన్నీరుగాఁ నేడువఁ దొడంగెను.

అప్పుడు వరుణదత్తుండు వానిమాట లాలించి యేదియో జ్ఞాపకము దెచ్చికొని హా! గంధర్వదత్తా ! నీ వృత్తాంతము మఱచిపోయి యన్యదేశంబున సుఖింపు చుంటి గదా ! అయ్యో నీ పేరైన జ్ఞాపకము లేకపోయినదే. హా ! పుష్పదంతా నీ మొగ మొకనిమిషము చూడకున్న పరితపించెడు నే నిన్ని నాళ్ళు నిన్నుఁజూడక యెట్లుంటినో హా! కన్నతండ్రీ! హా! ప్రాణేశ్వరీ ! యని పలుకుచు నేలంబడి మూర్చిల్లెను. అప్పుడు వసంతసేన విభ్రాంతిపడుచు అయ్యయో ! యిదియేమికర్మము నా ప్రాణేశ్వరుఁడిట్లు పలవరింపుచుఁ పడిపోయెనేమి ? రక్షింపుఁడు రక్షింపుఁడని పలుకుచు ? శైత్యోపచారములు పెక్కు చేయించినది కాని తెలివివచ్చినదికాదు.

పరిచారకు లతని మెల్లన నెత్తుకొని లోపలిగదిలోనఁ బరుండబెట్టిరి. వసంతసేన దాపునఁ గూర్చుండి విసరుచుఁ బెక్కండ్ర దైవములకు మ్రొక్కుచు నాథా ! మనోహరా ! ఇటుచూడుము. మాట్లాడుము నే నెవ్వతెను ? అట్లు పలవరించి రేల ? గంధర్వదత్త యెవ్వతె ? చెప్పుఁడని పిలిచిన నతఁడు కన్నులం దెరచి నిట్టూర్పు నిగుడించుచు నీవెవ్వతెవో నే నెఱుంగ, నా యర్థశరీరము గంధర్వదత్త యెందున్నది ? నా ముద్దులపట్టి యేడీ ? యిక్కడికి నేనెట్లు వచ్చితిని ? నా రాజ్యమేమైనది ? అని యూరక పలవరించుచుండ భయపడుచు వసంతసేన వైద్యులఁ బెక్కండ్ర రప్పించినది.

వారు పరీక్షించి యీతని కేమియు భయములేదు. సైతాను సోకినది. ఎవ్వరును బిలువవద్దు. తలుపులువైచి పంచుకొననిండు. సాయంకాలమున కన్ని దోషములు పోవుననిచెప్పి తగు చికిత్సల జేసి యరిగిరి. వసంత సేనయు వారుచెప్పినట్లు తలుపులువైచి పిలువక ద్వారము దాపున గూర్చుండి చూచుచుండెను. అంతలో సాయంకాలమైనది. అప్పుడు సుల్తానువారి యొద్దనుండి యేడు గుఱ్ఱముల బండి పెండ్లి కూఁతుం దీసికొని పోవుటకై వచ్చినది. పుష్పహాసుండు వేరొక మేడలోఁ గూర్చుండి యలంకరించు కొనుచున్నాడు. కావున వరుణదత్తుని వృత్తాంతమేమియు నెఱుఁగక బండి వచ్చిన వార్తవిని వజ్రమాల దన్నుఁ బరిహాసమాడుచుండఁ జక్క గా నలంకరించుకొని యాబండిలోఁ గూర్చుండెను. అప్పుడు నియంత యత్యంత వేగముగా నాశకటమును సుల్తానుగారి యంతఃపుర నికటంబునకు దీసికొనిపోయెను.

భేరీపటహాదివాద్య ధ్వానంబులు రాజమందిరముఁ బెల్లుగ మ్రోగుచుండ వేగురుపరిచారికలు వచ్చి యచ్చెల్వనంతఃపురమునకుఁ దీసికొనిపోయిరి. చిన్నసుల్తాను వేగిరపడచుఁ బురోహితునితోఁ దొందరగా మంత్రంబులం జదివి పెండ్లి తంత్రము జరపుమని కోరిన నతఁడట్టు చేసెను.