పుట:కాశీమజిలీకథలు -04.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

268

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

అది యంతయు జూచుచున్న రెండవ చిన్నది నిజము చెప్పినదనియు దానిలోఁ కలిసియున్న దని దానింగూడ శిక్షించిరట. ఎంత కపటమో చూడుఁడు. వారి వృత్తాంత మంతయు నాతోఁ జెప్పిరి. ఆమె కడునిల్లాలని నేను బ్రమాణము చేయ గలను. రామరామా ! పదిదినములనుండి యేమియుం గుడుచుటలేఁదట. వారి యుసురు వారి కెన్నడు తగులునో ? ఆ సుందరి చక్కఁదనము చూచితీరవలయు నుపవాసముల గృశించి మాసిన చంద్రరేఖవలె నొప్పుచున్నది. మీరు వారినిచ్చటికి దీసికొని వచ్చునట్లాజ్ఞ యియ్యవలెను.

వారికి భోజనముపెట్టి రక్షించెదనని పలికిన విని తన జవరాలి కనికరమునకు లోపల మెచ్చుకొనుచు వరుణదత్తుండు నవ్వుచు సరిసరి నిన్నక్క డికిఁ బొమ్మనుట మాదియేతప్పు. నేరముచేసిన వారందరునిట్లే చెప్పుచుందురు. వారి మాటల ననుసరించి చేసిన వ్యవహారములు సాగునా ? తప్పుచేసి లేదని ప్రమాణికములు చేయుదురు. ఎవ్వరు నొప్పుకొనరు. నీ కా నిదర్శనము చూ పెద, భోజనమైన వెనుక నాతో రమ్మని పలికెను. అప్పుడా యెలనాగ దయితా ! అదియేమియు నాకుఁదెలియదు వారింగాపాడక తీరదు.

ఎల్లవారివలె వారిమాటలు నిరసింపరాదు. వారింజూచిన మీకే జాలిపొడము నని యెన్నియో విధముల బ్రతిమాలికొన్నది. అప్పుడతండు కానిమ్ముఁ జూతముగాక యని పలికి భుజించిన వెనుక భార్యనుదీసికొని యా యుద్యానవనమునకరిగి యోరీ ! నిన్న వచ్చిన యపరాధుల బురుషుల నిచ్చటికిఁ దీసికొనిరండని యొక మా కందము క్రిందఁ గూర్చుండి కింకరుల కాజ్ఞాపించుటయు వారు ముహూర్తములో వారిందీసికొని వచ్చి యెదురం బెట్టిరి. అప్పుడు వరుణదత్తుఁ డందొకనిం జీరి యోరీ ! నీ వేమి నేరము జేసితివి. నిన్నేమిటికి శిక్షించితిరని యడిగిన నతండు తలవాల్చుకొని యేమియు మాటాడినాఁడు కాఁడు.

అప్పుడతండు మఱియొకనిం బిలిచి నీవేమితప్పు జేసితివి. నీ కేమిటికీ ద్వీపాంతరవాస శిక్షవిధించితిరి ? నిజము చెప్పుము. నిన్ను విడిపింతునని యడిగిన నతండిట్ల నియె, అయ్యా ! నే నేపాపము నెఱుంగను. దైవముతోడు ఆ చిన్న దాని నడవిలోనుండ మా యింటికి గృహస్థధర్మమున రమ్మంటిని వచ్చినది. ఆ కడియ మదియే నాకిచ్చినది. అది తప్పని యెట్లుచెప్పనగు ? దానిం గొనిపోయి యంగడిలో నమ్మజూప వాఁడు తొత్తుకొడుకులు నన్నుఁ బట్టుకొని సింధువార నగరంబునకుఁ దీసికొనిపోయి ధనంజయుని యెదుటఁబెట్టిరి.

అతండు ధర్మాత్ముఁడు కడియము బుచ్చుకొని నన్ను విడిచిపెట్టునను కొంటిని. లలితా! గంధర్వదత్తా! యని యేడ్చుచు వాఁడు నా కొంప ముంచివేసెను. అబ్బబ్బా ! యీ రాజభటులు పెట్టిన చిక్కులకు మేరయున్నదా ? అన్నమైనఁ దిన్నగా దిననీయరు గదా ? నాయుసురు వీరల కెప్పుడు తగులునో ? అకటా ! ఏ దోస