పుట:కాశీమజిలీకథలు -04.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుల్తానుగారి కథ

267

అదియునుగాక రాజుదలఁచిన దెబ్బలకుఁ గొదవా యనినట్లు వానిపనికాదని మందలించు వారెవ్వరు ? మన మూరకుందుమేని మన జీవికకును భంగమురాఁగలదు. ఆ మాట నా బోఁటితోఁ చెప్పుటకు నోరాడకున్నది. యేమిచేయుదుము ? అని ధ్యానించుచుండ రెండుజాములు దాటినది. ఎవ్వరికిని భోజనములులేవు.

అప్పుడు వారి సంవాదమంతయు సవసవగా విని పుష్పహాసుఁడు మెల్ల న నా గదిలోకింజని నమస్కరించుచుఁ దల్లీ! మాకు నీవు తల్లివనియు నాయన తండ్రి యనియు మేము భావించుచున్న వారము. మా విషయ మిప్పు డెద్దియో కలతపడి భోజనము చేయకున్నారు. అది న్యాయముకాదు. మీ యాజ్ఞయైనచో నగ్నియైనం జొచ్చెదము. మీరు కావించెడు నారద మేతాదృశ్యంబేయని పలికిన వరుణదత్తుఁ డర్ధ స్వరముతో నిట్లనియె. పుత్రీ! నీవనినట్లు మిమ్ము మేమట్లు చూచుకొను చున్నారము. ఇఁక పదిదినములలో నోడవచ్చుననియు మిమ్మమరావతికిఁ బంపుదుమనియు దలఁచు చుంటిని.

దైవము మఱియొక యిక్కట్టు దెచ్చి పెట్టెను. నిన్న మీరు నా యెఱుక లేకుండఁ బురము తిరిగివచ్చిరఁట. అప్పుడు సుల్తాను బండిలో నిన్నుఁ జూచి వరించెను. ఇప్పుడు తనకుఁ బెండ్లి చేయమని కోరుచున్నాడు. వలదన బలాత్కారముగాఁ దీసికొనిపోవునఁట ! అందులకే మిమ్ము వెలపలకుఁ బోవలదని చెప్పితిని. ఇప్పుడేమి చేయుటకుం దోచక యాలోచించుచున్నారమని చెప్పిన నొక్కింత యాలోచించి యతం డిట్ల నియె. ఆర్యా 1 యీ కార్యమునకు మీరింత సంశయింప వలయునా నేనుబోయి శీలము చెడకుండ నతనిచేతనే వలదనిపించుకొని వచ్చెదను.

అంగీకరించితిమని ప్రత్యుత్తరము బంపుఁడు. దానిమగండెప్పుడును దాని ననుసరించి తిరుగుచుండును కావున జాగరూకతతో మెలంగవలయునని మాత్రము దానిలో వ్రాయుఁడు. సంశయింపకుఁడు. కార్యము సాధించుకొని వచ్చెదనని యత్యుత్సాహముగాఁ బలికిన వరుణదత్తుఁడు సంతోషముతోలేచి మీరు సన్నాహము చేసికొన వచ్చును. మీరు కోరిన చిన్నదాని నీ రాత్రి యనుపుచున్నానవి ప్రత్యుత్తరము వ్రాసి తనతో వచ్చి వాకిట నిలిచియున్న రాజభటునకిచ్చి యంపి భోజనమునకు లేచెను.

వాడుకప్రకారము వసంతసేన పతి భుజించుచున్నప్పుడు తాళవృంతమున విసరుచు దాపున నిలువంబడి ప్రాణేశ్వరా ! నిన్న మీరుచెప్పిన నాఁడువాండ్ర నిరువురఁ బ్రొద్దుబోయి చూచితినిసుండీ! పాప మక్రమముగా వారిని శిక్షించిరి. ఇందు మూలముననే రాజ్యాంతమున నరకము వచ్చునని శాస్త్రజ్ఞులు చెప్పుదురు ఆ వర్తకు నెవ్వఁడో కాలితో దన్ని జంపెనట. కాకతాళీయ న్యాయముగ నమ్మవారికి నుపహారము లీయ నప్పు డక్కడికిఁ బోయిన నామెమీద నీనేరమువైచిరఁట ఆమె మహా పతివ్రత కావున నేమియు మాటాడినదికాదట.