పుట:కాశీమజిలీకథలు -04.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

266

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

వసంతసేన తన భర్తతోఁ జెప్పియే వారిని రప్పించెదననిచెప్పి యంతలోఁ బ్రొద్దెక్కుటయు నింటికివచ్చి గృహకార్యముల జక్కజేసికొనుచుండగా నప్పుడు వరుణదత్తుఁ డాస్థానమునుండివచ్చి తనగదిలో బండుకొని భార్యకు వర్తమానము జేసెను.

అప్పుడు వసంతసేన పతియొద్దకఱిగి కోపవిషాద మేదురహృదయుండై యున్న మగనితో మెల్లన సుల్తానుగారు మిమ్మేటికి రమ్మనిరని యడిగిన నతం డించుక యలుకతో నిన్న మనయింటనున్న యాఁడువాండ్రు బండియెక్కి పురమంతయుఁ దిరిగిరా ? యని పలికిన నప్పడఁతి గడగడ వడంకుచు నాథా ! వారు పట్టణ విశేషంబులం జూతుమని పదిదినములనుండి నన్నుఁ గోరుచుండ నిన్నఁ బంపితిని. దాన సుల్తానుగారికిఁ గోపము వచ్చినదా ? యనుటయు నతం డిట్లనియె .

సుల్తానుగారి కథ

అది పాడుఁవీఁడని నేను జెప్పుచుండలేదా ? ఆఁడువాండ్రు వీధింబడి పోయినం జూచి యీ చెడుగులోర్చుదురా ? సుల్తానుగారి వీధినుండియే యా బండి తోలించిరఁట ? సుల్తానుజూచి మువ్వురిలో నా యెఱ్ఱదానిని మోహించెనఁట. రాత్రి యెల్ల నిద్దురబట్టక విరహాతురుండై పరితాపము జెందుచుండెనఁట. దాని దనకుఁ బెండ్లి చేయుమనియు, నది మగనాలియని చెప్పినంత దాని మగడెంతసొమ్ము గోరినను నిత్తుననియు నందులకు నీవొడంబడవేని బలిమినైని దానిం గొనెదననియు జతురుపాయంబులచేతను నన్నుఁ గోరికొనియెను. వాని కేమని యుత్తరమిత్తును ? గోవులం జంపి తినువారికిఁ గనికరముండునా ? మనము చెప్పినట్లు వినుటకు వీఁడు వెనుకటి సుల్తానా ? క్రొత్తఁవాడు. యౌవన మదమున నొడలెరుంగకున్నాఁడు. నేనును గొంచె మాలోచించి దేవా ! మీ మాట కాదనుటకు నే నెంతవాఁడ. ఇంటియొద్దఁ జెప్పి యప్పడఁతి నొప్పించెద ననుజ్ఞయిండని పలికి యనిపించుకొని వచ్చితిని. ఇదియే యచ్చట జరిగిన విశేషము. తరువాత నేమి చేయవలయునో ? యాలోచించుకొనుమని పలికిన విని యులికిపడుచు నక్కలికి ముక్కు పై వ్రేలిడికొని యిట్లనియె.

భళాభళి ! ! సేబాసు. ఎట్టి విపరీతములు వినంబడినవి. యీ క్రొత్తసుల్తా నంత మత్తిల్లినాఁడా ? ఒకని పెండ్లాము నెట్లు పెండ్లియాడును ? పతివ్రత లందు కంగీకరింతురా ? అయ్యో ఈ యుపద్రవము నాకేమి తెలియును ? పురిజూతుమన నంపితిని. అక్కటా ! నాలుగు దినములు మనయింటఁ దలదాచికొన వచ్చిన యా చిన్నదానితోఁ గులముచెడి నీచజాతివానిం గలియుమని యెట్లు చెప్పుదును. ప్రాణము బోయినను నా నాల్కనుండి యా మాటరాదని పలికిన నతండిట్లనియె.

నారీమణీ ! వారిలోఁ బెండ్లి యాడినదానిని మఱలఁ బెండ్లి యాడఁగూడదను నిషేధములేదు. పశువులం గొనినట్టె దానివారలకు సొమ్మిచ్చి గైకొనుచుందురు.