పుట:కాశీమజిలీకథలు -04.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వసంతసేన కథ

261

నీచులకు స్వస్థానబలం బధికము. ఆ పురుషుడు మఱునాఁడుదయ కాలము వఱకు విశ్రాంతిగానక తిరుగుచు బాషాణదండ ప్రహరణంబుల మేనంతయు రక్తము గారుచుండఁ సేకస్త్రాచ్ఛాదితుండై దుఃఖించుచు ఉనున్మత్తుండువలె మాయింటిదాపునకు వచ్చెను. అపుడు మాతండ్రి వీధియఱుగుపయిఁ గూర్చుండి దంతధావనము జేసికొనుచు దురక బాలురచే దరుమఁ బడుచున్న యా పురుషుం జూచి జాలిపడి నిలునిలుం డని వారినెల్ల నదలించి యతనిం దాపునకుఁ బిలిచెను.

అప్పుడతండాహా ? ఇంతపట్టణములో నీ మాత్రము చల్లగామాటాడిన పుణ్యాత్ముఁ డిదివఱకు గనంబడలేదు. ఎవ్వరితో జెప్పుకొనినను బాదుమనువారే కాని యాదరించుమనువారొక్కరును లేరు శ్రీరామరామ ! యిది రాక్షసనగరమని తోచు చున్నదే ! యని పలుకుచు నతండు మాతండ్రి దాపునకువచ్చి నమస్కరించుచు దన దెబ్బలన్నియుం జూపి అయ్యా ! ఇంత యన్యాయ మెందైనం గలదా ? ఇక్కడఁ బ్రజలం బాలించు రాజులేడా ? అయ్యయ్యో ? నిన్న రాత్రియెల్ల నన్నీ పౌరులు పెట్టిన బాధ పరమేశ్వరుఁ డెఱుగు. పూర్వజన్మమున నెట్టిపాపముచేసితినో యని దుఃఖింపుచుఁ దనపాటమంతయు మాతండ్రితోఁ జెప్పుకొనియెను.

మా తండ్రి యతని మాటలచే హిందువుఁడని తెలిసికొని యోదార్చుచు లోపలికి దీసికొని వచ్చి వైద్యుల రప్పించి యా గాయములకుఁ జికిత్స జేయించి యన్న పానాదులిచ్చి యాదరించెను. నాలుగు దినములలో నా గాయము లన్నియు మానిపోయినవి. తదీయ రూపరేఖా విశేషంబులు మదికచ్చెరువు గొలుపఁ మా తండ్రి యొకనాడు నీ వెవ్వడవు ? ఇందేమిటికి వచ్చితివి ? నీ వృత్తాంతము సెప్పుమని యడిగిన నా పురుషుం డేదియో ధ్యానించుచు నేనొక గొప్పవంశపు క్షత్రియుఁడ నా పూర్వ చారిత్ర మేదియో నాకే స్పురింపకున్నది. తెలిసినట్లే యుండును గాని చెప్పుటకు నోఁటికిరాదు. శాపోపహతుండనై సముద్రంబునం బడితిని. అందు మునుంగకయీది కొని తీరము జేరి నిన్న సాయంకాలమున కీ పట్టణములోఁ బ్రవేశించితిని. తరువాతి కృత్యంబు లన్నియు మీకు విన్నవించియే యుంటినన చెప్పిన వెఱఁగుపడుచు మా తండ్రి యతనిం దనయింటఁ బెట్టుకొని వరుణనిత్తుఁడని పిలుచుచుఁ బోషింపుచుండెను.

మఱికొన్ని దినము లరిగిన వెనుక నే వినుచుండ మా తల్లి తోఁ గాంతా ! మన వసంతసేనకు బ్రాయము వచ్చినది. వివాహము చేయవలసినదిగదా. మన జాతివా రీ దేశమునలేరు. ఈ వరుణదత్తుఁడు రూపంబున మన్మధుం బోలియున్న వాఁడు. విద్యాగుణ శీలంబుల నన వద్యుఁడనియే చెప్పదగినది. ఉత్తమ క్షత్రియుఁడఁట. వీని మన యింటికి భగవంతుఁడే తీసికొనివచ్చెను. వీనికి మన వసంత సేననిచ్చి వివాహము చేయవలయునని యున్నది. నీ వేమనియెదవని యడిగిన మా తల్లి నా మొగము చూచినది. నేనింగితముల నంగీకారము సూచించితిని. అప్పు డా దంపతులు సంతోష