పుట:కాశీమజిలీకథలు -04.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

260

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము


వసంతసేన కథ

సుందరీ ! మాతండ్రి హిందూదేశవాస్తవ్యుండు. శూరసేనుండను నొక సామంతరాజు అప్పటి చక్రవర్తి కాయనపై యెద్ధియో కోపమువచ్చి మున్నిచ్చిన గ్రామంబులు లాగికొని కట్టుగుడ్డలతో విడిచిపెట్టెనఁట. అప్పుడు తనకుఁ గలిగిన యవమానమునకు మిక్కిలి లజ్జపడుచు మాతండ్రి యాదేశమున నుండనొల్లక భార్యతో బయలుదేరి విదేశములయాత్రచేయుచుఁ బ్రవహణ ప్రయాణంబున నొక్క నాఁడు మక్కాయను పట్టణంబున కరిగెను.

అప్పుడు దైవవశంబున నీపట్టణపు సుల్తానుగారి భార్య పెద్దబిబ్బియాత్రార్థమై యక్కడికివచ్చినది. ఎట్లో మాతండ్రిగారామెతోఁ బరిచయముచేసికొని తనకుటుంబ గౌరవమంతము నామెతోఁ జెప్పుకొనిరఁట. అప్పుడామెకు జాలిగలిగి యాదంపతులఁ దమతో నీవిఁటికిం దీసికొనివచ్చి యిందొక యుద్యోగమిప్పించినది. మాతండ్రి మిగుల బుద్ధిమంతుఁడగుడఁ గ్రమక్రమంబున నాశ్రయించి సుల్తానుగారి యనుగ్రహమునకుఁ బాత్రుండై మిగుల ధనము సంపాదించెను.

మాతండ్రి యిక్కడికివచ్చి నలుబది సంవత్సరములై నది. ఇక్కడికివచ్చిన పదిసంవత్సరములకు నేను జనించితినఁట. లేక లేక గలిగినదానగుట నన్నత్యంత ప్రేమానుబంధ పూర్వకముగా జూచుచుఁ బెంచుచుండిరి. కాలచక్రంబున నభివృద్ధి నొందుచున్నఁ నా మేన యౌవనచిహ్నములు పొడసూపుచుచుండ మాతండ్రికి వివాహ చింతస్వాంతంబున వేధింపందొడంగినది. కామధేనువు గటికివానికి దానమిచ్చినట్లిందలి యవనులకుఁ గూతునిచ్చుట కంగీకారము గలుగదుగదా ! స్వజాతి పురుషుఁడీదేశమునలే డేమిచేయుటకుందోచక మాతండ్రి దైవముమీదనే భారమువైచి కాలక్షేపముఁజేయు చుండెను.

అట్లుండ గొండకనాఁటి సాయంకాలమున నొక పురుషుఁ డీపురవీధులం దిరుగుచుఁ గనంబడిన వారినెల్ల అయ్యా ! బాటసారులు నివసింపదగిన సత్ర మెందున్నదని యడుగుచుండఁ దురకలు పరిహాసము సేయుచు నటుయిటు యిటుసటు అని త్రిప్పుచుండిరఁట. ఇందున్నవారికి సత్రమన నేదియో తెలియదు. మసీదని యడుగవలయు నా పరిభాష యాపురుషుఁ డెఱుంగడు. పాపము రాత్రి రెండు యామముల దనుక తిరుగుచుండెనఁట. మఱియుఁ ద్రాగిమత్తిల్లి యొడలెరుంగక తిరిగెడు యవను లతనిం దిట్టుచుఁ గొట్టుచు బారద్రోలుచుండిరి.

మాతంగడింభకుల రాయిడింబది పరుగులిడు వృషభవత్సంబుచాడ్పున నతండు వీధులవెంబడి పరుగులిడఁ దొడంగెను. దొంగ దొంగ య మఱికొందఱు తరిమిరఁట, హిందువులంజూచిన నిచ్చటివారు కుక్కలంబోలె తరుముచుందురు. వీరికి దయాదాక్షిణ్యములు లేవు.