పుట:కాశీమజిలీకథలు -04.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వరుణదత్తుని కథ

259

సువర్ణచ్చాయయుఁ గలిగి మిక్కిలి శోభించుచున్న యాపురుషసౌందర్యమునకుఁ బొడవగు గడ్డము మాత్రమించుక వికారముగానున్నది.

అతని రూపలక్షణములు పరీక్షించి యౌదార్యపురుషుఁడని నిశ్చయించి పుష్పహాసుండు సలాముచేయుచు అయ్యా ! మాది హిందూదేశములో రేవానగరము. అమరావతీపురంబున కరుగుచుఁ గడలి నడుమ గాలివానపట్టి కలము వికలమై యీ దెసకుఁ గొట్టికొనివచ్చి శకలమైనది. పిమ్మట దొంగలు వస్తువులు దోచికొనిరి. దారిఁ గానక యిట్లు వచ్చుచున్నారము. మాదేశమునకు పోవుమార్గ మేదియేనియున్నఁ దెలిపి పుణ్యంబు గట్టికొనుఁడని సవినయముగాఁ బ్రార్దించిన జాలివొడమ యప్పుణ్యాత్ముం డించుక సే పేదియో ధ్యానించి యిట్లనియె.

మగవారి తోడులేక యాఁడువాండ్రు పయనము సేయవచ్చునా ? మీరిప్పు డీపట్టణములోఁ బ్రవేశించితిరేని యీయవనులు మిమ్ము భంగపెట్టకుందురా ! మీ పుణ్యము మంచిది కావున, నాకుఁ గనంబడితిరి. మాయింటికిరండు స్వల్పకాలములో మీ దేశమున కనిపెద, నిందుఁ గూర్చుండుఁడని తనబండిలో నొకమూల తావిచ్చెను.

ఆ పురుషుని యకారణవాత్సల్యమునకు స్తుతిఁజేయుచు పుష్పహాసుఁడా యిరువురతరుణులతో నాబండిలోఁగూర్చుండెను. పైవిహారముమాని యాయుద్యోగస్థుఁడు బండి మఱలించి యప్పుడే తనయింటికిఁ దోలించుకొనియెను. తదీయమందిర ప్రాకారవిశేషంబులెల్ల జూచి యబ్బురమందుచుఁ బుష్పహాసుం డతనినొక చక్రవర్తిగాఁ దలంచుచుండెను. పిమ్మట వారు మువ్వురు భృత్యనిర్దిష్ట మార్గంబున లోపలికింబోయిరి. ఆ యజమానిభార్య వారి వృత్తాంతము దా సేతరులవలస విని మిక్కిలి గౌరవించుచు నివసింపఁదగు గదులంజూపినది. ఆమెచేసిన సత్కారములకు కడువిస్మయము జెందుచుఁ బరోపకారపారీణు లన్నిదేశములలో నున్నారుగదా యని యగ్గడింప దొడంగినది.

వారింటనున్నప్పుడుకూడ వజ్రమాల పుష్పహాసుఁడు తనమనోరథము తీర్చునని యాసపడుచు నాసన శయనాది సమయములయం దేకాంతముగా దొరకునేమోయని చూచుచుండెను. కాని యతండట్టి యవసరమీయక తప్పించుకొని తిరుగు చుండెను క్రమంబున బుష్పహాసుండా యజమానిభార్యతోఁబరిచయముగలుగఁజేసికొని యొకనాఁడు అమ్మా ! యీపట్టణములోనున్న వారందఱునొక్క జాతివారుగా గనంబడుచున్నారు. మీమతము హిందూమతమువలెఁ దెలియఁ బడుచున్నది. -------------- దులసిమొక్కవోలె మీరొక్కరీతుఱకవీటిలో నెంతకాలమునుండి వసించితిరి ? మీ వృత్తాంతమించుక చెప్పియామోదము గలుగఁజేయుమని ప్రార్థించినదా సంతసించుచు నిట్లనియె.