పుట:కాశీమజిలీకథలు -04.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

258

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

దీవియని చెప్పిరి. అంతలో దమదెసకెవరో వచ్చుచున్నట్లు గనంబడిన సంతసించుచు వీరును వారికభిముఖముగా కొంతదురముపోయి వారినేదియో యడుగదలంచునంతలో వాండ్రు దొంగలని తెలిసికొని పారిపోవఁ బ్రయత్నించిరి. కాని యంతలో వాండ్రు వచ్చి కలిసికొని వారి శరీరముననున్న వస్తువులన్నియు లాగికొని కట్టుగుడ్డలతో విడిచిపెట్టిరి. నావికులు మఱియొకదెసకుఁ బారిపోయిరి. కావున వీరు మువ్వురు మాత్రమే మిగిలిరి.

అప్పుడు స్త్రీవేషము విడిచి పుష్పహాసుఁడు తొంటిరూపముతోఁ తిరుగఁ బ్రయత్నించెను. కాన, వజ్రమాలతల్లివలన మాటవచ్చునని యంగీకరించినదికాదు. అతం డారూపముతోడనే యుండి వారిరువుర నోదార్చుచు ధైర్యము వహించి యందున్న యొకదారి ననుసరించి నడువసాగెను. ఆ పర్వతము దిగినతరువాత నందున్న భూమి తెరపిగానే కనంబడినది. ఆదారి సముద్రముదరిగాఁ బోయినది. వారా దారిననుసరించి నడుచుచుఁ గొంతదూరము పోయిన వెసుక నొకచోటఁ గొందఱు మనుష్యులు నేల దున్నుకొనువారు గనంబడిరి. వారింజూచి పుష్పహాసుఁడిది యేదేశము? గ్రామమెంత దూరమున్నదని యడిగెను. కాని వారి కామాట తెలియక వారి భాషతో మీరెవ్వరని యడిగిరి.

పుష్పహాసుఁ డఖిలభాషా వేదియగుట, దెలిసికొని వారిభాషతోనే మఱల నడిగెను. వారప్పుడది యవనద్వీపమనియు యవనావతియను పట్టణ మచ్చటికి రెండు క్రోశముల దూరములో నున్నదనియుంజెప్పిరి.

వరుణదత్తుని కథ

ఆ మాటవిని పుష్పహాసుఁడు భయమభినయించుచు బోటులారా ! మనము ప్రాణసంకటమైన చోటునకు వచ్చితిమి. ఇది యవనద్వీపమంట. మనదేశములోఁ దప్పుజేసినవారిని యీద్వీపమునకుఁదీసికొనివచ్చి విడిచిపెట్టుదురు. ఇందున్న ---- లతిక్రూరులు. పొలదులంబట్టి వేధింపుచుందురని మనదేశములోఁ జెప్పుకొను చుందురు. పోనిండు యేమి చేయుదుము ? దైవమట్లు పంచిన నట్లు పోవలసినదేగదా యని పలుకుచు వారిని వెంటఁబెట్టుకొని యతండు వడిగా నడచుచుఁ గొంచెము ప్రొద్దువేళ కాపట్టణప్రాంతమునకు పోయెను.

అట్టి సమయమున నొక్క గొప్ప యుద్యోగస్థుఁడు రెండుగుఱ్ఱముల బండిమీఁద విహారార్దమై యరుదెంచుచు దారిలో వారిమువ్వురింజూచి బండినాపి మీరెవ్వరు ? ఎందుఁబోవుచున్నారని పరిచారకులచే నడిగించెను. పుష్పహాసుఁడు బండి దాపునకుఁ బోయి యా పురుషుని యాకారము విమర్శించిచూచెను. విశాలమైన నేత్రములును, చంద్రబింబమువంటి మొగము, ఆజానుదీర్ఘభాహుపులు వెడదరయురము