పుట:కాశీమజిలీకథలు -04.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

యపరిచితు నొక్కసారి చూచినంతనే యింతకుమున్ను కంతువిలాసముల నేవంగించు మదీయస్వాంతమున వింతసంకల్పములు బొడముచున్నవి. ఆహా! స్త్రీహృదయముకన్నఁ దరళమైనది మఱియొకటి లేదుగదా.

కుంద - మాధవీలత సహకారమును విడిచి దుత్తూరముపైఁ బ్రాకినప్పుడు గదా నిందించుట.

లవంగి - దుత్తూరమో సహకారమో నాకుఁ దెలియదు. కాని యీకార్యము కొనసాగునదియా?

కుంద - మనపయత్న మక్కరలేకుండ దైవమే కొనసాగింపఁగలఁడు. లక్షణము లట్లు గనంబడుచున్నవి.

లవంగి - ఊరడింపుమాటలు మాని కార్యసాఫల్యమగు తెరువరయుఁడు.

కుంద - సిరి రా వలదనువా రుందురా యేమి?

లవంగి — ఇప్పు డెంతకాలమైనది? నేఁటి యుదయముననే మనమతనిం జూచినది.

లవంగి – అబ్బా! యుగాంతరము లై నట్లు తోచుచున్నది.

సంగీత - ఆలాగే యుండును. ప్రొద్దుపోయినది. నిద్రపొమ్ము . ఱేపు విచారింతము.

అని సంభాషించుకొని యాచేడియలు నిద్రపోయిరి. కాళీపట్టణములోని మసీదుఫకీరులు వీరునియందు మక్కువగలవా రగుటచే యవన సేనలోనికిం జని యచ్చటివిశేషములు ప్రతిదినమువచ్చి సాయంకాలమునఁ జెప్పుచుందురు. దానంచేసిన వారికీ రాకపోకలవిషయమై యాటంక మేమియు జరిగింపఁ బడలేదు. యవన సేనాపతులు ఫకీరులను తలంపుతోఁ దమరహస్యములం జెప్పుచుందురు. శివరాత్రినాఁడు సాయంకాలమున లవంగి యీదినమున గుడికి రాదనియుఁ దిరుగ సేనలకు వ్రాసిరనియు రెండు మూడు దినములలో సేన వచ్చిన తరుకాత మీయూరిమీదఁ బడుదురనియు ఫకీరులు వీరునకుఁ దెలియఁ జేసిరి. ఆ వార్తవిని వీరుఁడందు మరియొకని గాపుంచి తాను సేనాముఖములన్నియుం జూచికొని యింటికింజని నిత్యక్రియాకలాపంబులం దీర్చుకొని తల్పంబుపై శయనించి యిట్లు ధ్యానించెను.

అయ్యో? నేను లవంగి రాకుండఁ గాపాడితి ననుకొంటిని గాని దానిపని యది చేసికొని పోయినది. నేనే మోసపోయితిని. పురుషుని కరమంత మృదువుగా నుండునా? స్వరమువలన స్పష్టముగాఁ దెలియఁబడుచున్నది. చూపులు లేడిచూపులవలె నున్నయవి. కన్నులఁ గాటుక గుఱుతు లున్నను నూహింపనైతిని. అది యంతయు నట్లున్నను స్తుతిశ్లోకము లది రచించినవే. అందు స్త్రీలింగవిశేషణము వైచుకొని నాతో మరియొకరీతిఁ బలికినది. అయ్యారే! ఎన్ని విద్యలలో బరిశ్రమచేసినది! వక్తృ మెంత కొనియాడదగినది: దానంజేసియే హిందూమతాభిమాత్వనినియైనది. అట్టి