పుట:కాశీమజిలీకథలు -04.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

254

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

తడవయ్యెఁ గూఁతున కభిలాష గలిగినది కాఁబోలునని తలంచి యంగీకరించినది. పొలంతుకలుబొంకులకు నెలవులుకారా !

అట్లు తల్లి చే ననిపించుకొని వజ్రమాల యా మేడలోనికిం బోయి తలుపులు వైచి గాజుదీపములు వెలిగించి యొకపీఠంబున నొదిగి యేదియో ధ్యానించుచున్న పుష్పహాసుం బలంకరించి ఆర్యా ! నీవిఁక వెఱవవలసిన యవసరము లేదు. రాజభటులువచ్చిరి. లంచమిచ్చి సాగనంపితి. ఇవిగో నీళ్ళు కాళ్ళు గడిగికొనుము. ఇవి ఫలము లివి భక్ష్యము లిది పరమాన్నము ఇవి పాలు నీ యిచ్చవచ్చిన వానిం భుజింపుమని పలికిన నతండిట్ల నియె.

తొయ్యలీ ! నాకొఱకింత ప్రయత్నము చేసితివేల ? ఇవి యన్నియు నేమిటికిఁ దెచ్చితివి ? నేను వాని భక్షింపనోపఁ బాలుమాత్రము పుచ్చుకొనియెదఁ గొన్ని దినములనుండి నొక వ్యాధి బాధింపుచున్నది. దానంజేసి పథ్యంబు చేయుచున్న వాఁడనని పలికిన విని యప్పడంతి యెడద కఱుకుమన మనోహరా ! యివి యన్నియు పథ్యములే. వీనిం దినిన నీ వ్యాధి మొదలంట బోవఁగలదు. తఱచు సుకుమారు లిట్లే పలుకుచుందురు. నా యాన వీనిం భక్షింపక తీఱదని బలాత్కారముజేసి యెట్టకే వానిచేఁ గొన్ని భక్ష్యములు దినిపించినది. పిమ్మట నాకులు మడిచి యిచ్చినది. కాని యతండది యందికొనక యా పళ్ళెములోనే యుంచి యిట్లు సంభాషించెను.

పుష్ప - బోఁటీ నీ మాటలు చేష్టలును బరికింప మిగులఁ భ్రౌడవువలె గనంబడుచుంటివి. నీ వేమైనం జదివితివా ?

వజ్రమాల -- ఎన్ని యేనిం జదివితి. నా చదువులకు నా రసికతకు నానందించు వారెవ్వరు?

పుష్ప - ఎవ్వరానందింపవలయు నీ భర్తయే యానందించును.

వజ్రమాల – నా భర్త యాపాటివాఁడైనచో నాకీ ప్రారబ్ధమేల ?

పుష్ప - (స్వ) ఓహో ? మిగిలిపోవుచున్న దే (స్వ) కానిమ్ము నీ వేయే గ్రంథములు చదివితివో జెప్పుము.

వజ్ర - వసుచరిత్రము, తారాశశాంకవిజయము, బిల్హణీయము, హంస విశంతి, శుకసప్తతి, రాధికాస్వాంతన, కొక్కోక, కామసూత్ర కందర్ప చూడామణి, అసంగరంగ, రతిరహస్య, నాగస్వర స్వకాసిరత్న, మన్మధ, సంహిత, మనసిజసూత్ర, రతిమంజరి, కామమంత్ర, రతికల్లోలినీ, పంచనాయక ప్రథృతి శృంగార ప్రబంధము లన్నియుం జదివితిని సంగీతములో నా ప్రభావము నేను జెప్పుకొనరాదుగాని సరస్వతినైన మెచ్చుకొనను. అన్నియుఁ గలిగియున్నవి అంచునకు తొగరుమాత్రములేదు.

పుష్ప - వైరాగ్య గ్రంథము లేమియుం జదువలేదా ?

వజ్ర - అవి వృద్ధులు చదువుకొనవలసినవి. మనబోంట్ల కేల ?