పుట:కాశీమజిలీకథలు -04.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

252

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము


నలువది నాల్గవ మజిలీ

వజ్రమాలకథ

గోపా ! వినుమట్లు పుష్పహాసుండు రాజభటులం దప్పించుకొని కోవెల ప్రాకారము దాటి యవ్వల కుఱికెనని నీకు విశదమైనదికదా ! అతండు వలయములు దిరుగుచు నా గోడ ప్రక్కనున్న దొడ్డిలోని మల్లి పందిరి మీదికి దిగెను. త్రాళ్ళపందిరిపై దట్టముగా నల్లి కొని నెరయఁ బూసియున్న యా మల్లి పందిరిపైఁ బడుటచే నతనికిఁ బతనవ్యధ యించుకయు గలిగినదికాదు. పుష్పశయ్యపైఁ బడిన ట్లందుఁ జిక్కు కొనియెను. అప్పు డందుఁ బదియా రేఁడుల ప్రాయముగల యెలనాగ యొకరిత మల్లి మొగ్గలు కోయుచు నాకసము నుండి తటిత్ప్రకాశము పడినట్లు పడిన యతనిం జూచి బెదురుకు దూరముగాఁ బారిపోయి యా దెస చూచుచుండెను.

అంత నతండావల్లి నల్లనఁ దప్పించుకొని లేచి పందిరి దిగి యమ్మగువ దాపునకుఁబోయి బాలామణీ ! యీ గృహ మెవ్వరిది ? నీ పేరేమి ? నీవు నా కొక యుపకారము సేయవలసియున్నది. నీ మొగము చూడ మంచిదానవువలెఁ గనఁబడుచున్నావు. నా కోరికఁ దీరుతుడి యనుటయు నా జవ్వని యతని మువ్వంపురూపు ఱెప్పలారక చూచుచు వెఱగుపడి స్మరశరషిద్ధ హృదయయై మోహావేశంబుననొక్కింత తడవొడ లెఱుంగక మైగరుపార స్మారవికారంబులు సూచింపుచు నించుక తలవంచుకొని యిట్లనియె.

సౌమ్యా ! నీవు దివినుండి యవతరించిన జయంతుఁడవని తలంచెదను. నీ యభీష్టమెద్దియో వక్కాణింపుము. సత్వరంబుగఁ దీర్చి కృతార్దురాలనగుదును. ఇది వజ్రదత్తుఁడను వర్తకుని గృహము. నే నతనికికూఁతురను నా పేరు వజ్రమాల యండ్రు మా తండ్రి యల్లునితో గూడ ద్వీపాంతరమందున్న యమరావతీపురికి వర్తకము నిమిత్త మరిగెను. మా తండ్రి పురుషాపత్య రహితుఁడగున నల్లునిం దెచ్చి యింటఁ బెట్టికొనియెను. మా తండ్రికిఁ బ్రవహణ వ్యాపారము రత్న వ్యాపారము మాత్రము గలిగియున్నవి. మేము గూడ మొన్ననే యా పట్టణంబునకుఁ బోవలసినదే. మా బంధువుఁడు పోలిసెట్టియనువాఁ డీనడుమ బలవన్మరణము బొందుటచేత నా పయన మాగిపోయినది. దానికి ఫలము మీ దర్శనమే యని వృత్తాంత మంతయుం జెప్పిన విని పుష్పహాసుం డాత్మగతంబున నిట్లు వితర్కించెను.

ఔరా ! యీ నారీమణి నన్ను జూచి మరుబారిం బడినది తాను మగనాలి యయ్యు నిట్టి వికారము బొందుట ధర్మవిరుద్దం బని యెఱుఁగదు. ఆహా! స్త్రీల చేష్టలు కడు విపరీతము లైనవి. కానిమ్ము. నేనిప్పుడు వైరస్యము జూపితియేని కార్యము చెడిపోవక మానదు. పరిచయంబు గలిగిన పిమ్మటఁ గ్రమంబున నొక్కి వక్కాణిం