పుట:కాశీమజిలీకథలు -04.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గంధర్వదత్త కథ

251

వృత్తాంత మంతయుఁ జెప్పెను. నీవు చెప్పినట్లా రాత్రిఁ బుత్రునితో మేడపై బరుండిరి. ఆ యుదయమున నేమైరో తెలియలేదని చెప్పిరి. మీ నిమిత్తము పెక్కు దేశములు వెదకించెనని యా వృత్తాంత మంతయుం జెప్పినది.

ఆ మాట విని మహిళ విస్మయము నొందుచు అగునగు నేనా రాత్రి నా రత్నకంకణముల జత తీసి తలక్రింద వైచితిని. అది యెట్లు చేఁప కడుపులోనికి వచ్చినదో చిత్రముగానే యున్నది అయ్యో ? నేనొక్కరి తనే యిక్కడ దుఃఖమను భవించు చుంటి ననుకొనుచున్నాను. వారును లేరా ? భళిరే విధాతా ? మాపై మంచి కన్నె వైచితివిలే యని యక్కజమందుచుఁ దిలకా ! మా సోదరుఁడు కుశలియై యున్నవాఁడా ! నా మేనకోఁడలు పుట్టినపుడు వచ్చితిని అది యిప్పుడు పెద్దదికావలయుఁ బెండ్లి జేసిరా దానికి లలితయని పేరు పెట్టిన జ్ఞాపకము. దానికన్న పెద్ద వాఁడు సుందరకుఁడను మగవాఁడుండవలె నెట్లున్నాడు అన యడిగిన విని తిలక అమ్మా ! నీ వడిగిన వారందరు క్షేమముగా నున్నారు. లలిత మాత్ర మిప్పుడింటివద్ద లేదని చెప్పెను.

అత్తవారింటికి వెళ్ళినదాయేమి ? దానికి మంచి సంబంధము వచ్చినదా ? నా సోదరుఁ డిది నీ కోఁడలు చూచుకోయని నా చేతంబెట్టె. నా కట్టి భ్యాగముపట్టునా? నా వంటి దుఃఖభాగిని పుడమిలో నెక్కడనులేదు. దాని కేమైనఁ బిల్ల లాయని యడిగిన విని తిలక అమ్మా ! యింకను బెండ్లి కాలేదు. యౌవన పురుషు నొక్కని వరించినది పరువపు గరువము యుక్తా యుక్త కార్య వివేకము గలుగనీయదు గదా ? రూపైకపక్ష పాతియగు మన్మథునిచే బెక్కుచిక్కులఁ బొందింపబడుచున్నదని యర్దోక్తిగాఁ బలికినది. అంతలో రాజభటు లాప్రాంతమందు సంచరించుటచే మాటాడికొనుట కవకాశము దొరకినది కాదు. ఆ యౌవన పురుషుఁడు పారిపోవునేమో యని సంతతము రాజ ప్రణిధులచ్చటనే యుండువారు.

మరికొన్ని నాళ్ళరిగిన వెనుక నొకనాఁడు దండనాధుఁడు వారి నెల్లఁ దన చదురునకు రప్పించుకొని తొలుత యౌవనపురుషుడు నుద్దేశించి పుష్పహాసా ! నీ చర్యలన్నియు వ్రాసి మా చక్రవర్తి యొద్ద కనిపితిని. ఆయన విచారించి నీవు రాజ ద్రోహివనియు దుండగుఁడవనియు వ్రాయుచు నీకు ద్వీపాంతరవాస శిక్ష విధించితిమని తెలియఁజేసిరి, అని చెప్పి పోలిశెట్టిం జంపిన యాఁడువాండ్ర కిరువురకు ఉరిశిక్ష విధింపక ద్వీపాంతరవాస శిక్షయే విధించెను. మా చక్రవర్తి యెంత దయాశాలియో చూచితిరా ? ఆడువాండ్ర కనికరించెనని యా రెండు తీరుపులు వినిపించి చమూపతి సభ చాలించి యింటికిం బోయెను. అని యెఱిగించి మణిసిద్ధుం డప్పుడు వేళ యతిక్రమించుటయుఁ దరువాత కథ పై మజిలీయం దిట్లు చెప్పం దొడంగెను.