పుట:కాశీమజిలీకథలు -04.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

250

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

నడిగినను మూఁగదానివలె మాటడక సమాధానము చెప్పితినిగాను. అదేమి కారణమో నా కథ యాయనతోఁ జెప్ప బుద్ధి పుట్టినదిగాదు. వెర్రిదానివలె మూఁగ దానివలె సంచరించుచుంటిని. పాపమా బ్రాహ్మణుఁడు నన్నుఁబుత్రికా నిర్విశేషముగాఁజూచి పోషింపు చుండెను. నేను పూర్వ చరిత్రమంతయు స్వప్న ప్రచారమని తలంచి వైరాగ్యముతోఁగాలక్షేపము చేయుచుంటి. ఇట్లుండ గొన్ని నాళ్ళకు నా దురదృష్ట వశంబుననే యా పుణ్యాత్ముఁడు కాలధర్మము నొందెను. ప్రొణోత్క్రమణ సమయంబున సూర్యభట్టు తన తమ్ముడైన యీ యార్యభట్టును రప్పించి సంతాన శూన్యుఁడగుటఁ దనసొత్తుతో గూడ నన్నితని కప్పగించుచుఁ దమ్ముఁడా ? యిది నా కూఁతురు సుమీ ? వట్టి వెర్రిది యేమియుం దెలియదు. దైవము నాకుఁ దెచ్చి యిచ్చెను. ఇది వెఱ్రిదైనను సద్గుణవంతురాలు సుమీ ! మూఁగదై నను జెప్పిన పని చేయుచుండును. కూఁతురుగాఁజూచి కొని దీని ముప్పు గడుపవలయు నిదియే నీవు నాకుఁ జేయుపని యని తనచేతఁ జేయి వేయించుకొని యా సుకృతి ప్రాణముల విడిచెను. అతనికిఁ నా యందుఁగల యకారణ వాత్సల్యమున కక్కజమందుచు నతని చావునకుఁబెద్దతడవు వాపోయితిని.

ఆర్యభట్టు నన్నూరడింపుచు దనయింటికిఁ దీసికొని వచ్చి భార్యతోఁ జెప్పి యన్న చెప్పిన చొప్పుననే యనురాగముగాఁ జూచుచుఁ బోషించుచుండెను. ఆయన భార్య రామాభాయియు భర్త వలన భయము చేతనో సహజ ప్రేమచేతనో దిక్కులేని దానననియో నన్నాదరముగానే చూచుచున్నది ఇట్లుండుటకును సహింపక దైవము మఱల నన్నీ యాపత్సముద్రములో ముంచెను. పోనిమ్ము. సర్వదుఃఖ విస్మరణ కారణంబగు మరణంబు సంప్రాప్తించుచున్నది కదా. విచారింప నేటికి మేమా బాలునకుఁ బుష్పదంతుఁడని పేరు పెట్టుకొంటిమి. మీరు పలుమారు పుష్పహాసుండనిచెప్పు కొనుచుండ వాఁడు జ్ఞాపకము వచ్చి హృదయంబున విచారము పొడమినది. ఇదియే నా వృత్తాంతమని చెప్పుచుండగనే తిలక విస్మయ మభినయించుచు నేమేమీ ? నీవు గంధర్వ దత్తవా యెట్టి చోద్యము ఎట్టి చోద్యము ! అయ్యో ! మీ కొఱకు మీ సోదరుఁడెంత విచారించుచున్నాడు. అయ్యారే ! నీ వృత్తాంతము వినిన నమ్మహారాజెంత సంతోషించును. నీ భర్తయుఁ బుత్రుఁడు నేమైరో నీకుఁ దెలియదు కాఁబోలు అహాహా విధి నిన్నెట్టి యిడుములం గుడిపించుచున్నాఁడు. అని వెఱగుపడఁజొచ్చిన నా యిల్లా లిట్లనియె.

పొలఁతీ ! నన్ను నీ వెట్లెఱుంగుదువు , మా సోదరుని పరిచయ యెక్కడ గలిగినది. నీ పేరేమి ? నీ వృత్తాంతము చెప్పితివి కావేమి ? నా భర్తయుఁబుత్రుఁడు నచ్చటలేరని నీ కెవ్వరు చెప్పరని యడిగినఁ దిలక అమ్మా ! నేను మీ మేనకోడలి సఖురాలను. నా పేరు తిలకయండ్రు. ఒకనాఁడు నీ కడియము మత్స్యగర్భంబున నుండగాఁ బల్లెవానికి దొరకినది . అది మా రాజునొద్దకుఁ గానుకగాఁ దెచ్చెను. దానిపై నీ పేరున్నది గురుతుఁబట్టి ధనంజయుఁడు కన్నుల నీరుగార్పుచు నప్పుడు నీ