పుట:కాశీమజిలీకథలు -04.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

248

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

మణి సెట్టిం జంపినట్టును తిలక సహకారిణియైనట్టును ధ్రువపరిచి వారిరువుర నపరాధినులుగా నిశ్చయించి యట్లువ్రాసి యా పత్రికల న్యాయాధికారియొద్ద కనిపి పైవారి యజ్ఞయగుదనుక వారి నిద్ధరఁ జెరసాలనుంపుఁడని కింకరుల కాజ్ఞాపించి చమూపతి యంతటితో సభఁ జాలించెను.

అప్పుడు తిలక యాత్మగతంబున అయ్యో ! యీ యౌవనపురుషుని మొగమెక్కడనో చూచినట్లున్నది. వీనిఁ బుష్పహాసుఁడని భ్రాంతి పడుచున్నారు. కాడని చెప్పుదునా. ఓహో ! పుణ్యమునకుఁ బోవఁ బాప మెదురుపడును ఈ మహిళ కుపకారము చేయఁబూనుటఁ గదా యిట్టియిక్కట్టు పడుచుంటి. ఈ గొడవ నాకేల. పాప మీ చిన్నవాఁడు నా మొగమువంక నూరక చూచుచున్నాడు. ఒక్కడైనఁ బరిచయము చేసియుండ లేదుగద ఆహా ! యురిదీయబడుటకు సిద్ధముగానుండ వెఱ్ఱి యూహలకుం బోవుచున్నానేయని పలు తెరంగులఁ దలంచుచుండెను

ఇంతలోఁ గృతాంతకింకరులవంటి రాజభటులు పదుఁడు పదుఁడని యదలించుచు వారి మువ్వుర బందీగృహంబునకుం దీసికొనిపోయి యాపురుష నొకగదిలోను నాడువాండ్ర నిరువుర నొక గదిలోను బెట్టి తలుపులు వైచిరి మకరందుఁడున్న గదికిని వీరున్న గదికిని నడుమ నినుపగవాక్షముండుటచే నొకరి నొకరు చూచుట కవకాశము గలిగియున్నది. రాజభటులు కొంచెము దూరముగాఁ బోయినంత దిలక యూరకొనలేక యా కిటికీనుండి తొంగిచూచుచు సుందరుడా ? నన్నూరక చూచుచున్నావు. నీవెవ్వడవు ? పాపము పుష్పహాసుండవని నిన్ను వీండ్రు బట్టికొనిరి. ఇది కడునన్యాయము. పుష్పహాసు నేనెఱుంగుదును. నీ కాపుర మమరావతీపురమని చెప్పితివి. అక్కడనుండి యిక్కడి కెప్పుడు వచ్చితివి? సింధుకారనగర కాపురస్తులం దెవ్వరైనఁ గనంబడలేదుగద. యని యడిగిన నాపురుషుండు మెల్ల గా దానికిఁ దెలియున ట్లేదియో చెప్పెను.

బాలా ! నాకథ చాల పెద్దది. పిమ్మటఁ దెల్పెదను. నీ వీ చెరసాల నేమిటికిఁ బడితివి. యామె యెవ్వతే ? నీ మొదటి వృత్తాంతము చెప్పనక్కరలేదు. తదనంతర వృత్తాంతము చెప్పుమని యడిగిన నాజవ్వని నివ్వెరపడిచూచుచుఁ దానాపట్టణముఁ జేరినది మొదలు జరిగిన కథయంతయుఁ జెప్పినది. అప్పుడా పురుషుఁడు మహిళామణి శీలమును గుఱించి మెచ్చుకొనుచు చమూపతి యన్యాయమును గురించి చింతింపఁ దొడంగెను.

వారిరువురట్లు మాట్లాడుకొనుచుండ మహిళకన్నీటి జడింబయ్యెదం దడుపుచు ముర్మోము వెట్టి దుఃఖింపఁ దొడంగినది. అప్పుడు తిలక అమ్మా ! మన మిప్పుడు యమలోకమునకుఁ బయనమై సిద్దముగా నుంటిమి. విచారించి బ్రయోజన మేమి ? నీ యాకారము జూడ గొప్ప వంశమునం బుడమినదానవువలె గనంబడు చుంటివి. ఇప్పుడైన నీ వృత్తాంతముజెప్పి నీ సఖురాలి మనస్సునకు శాంతిఁ గలుగ