పుట:కాశీమజిలీకథలు -04.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

246

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

సత్రము గోడల మీఁదను బాటసారులు వ్రాయుచుండుట వాడుకయున్నది. ఈ పద్యము లెవ్వరికిఁ దోచినట్టుగా వారు వ్రాసిరేకాని వీనికొక యభిప్రాయమందు వివక్షత యున్నట్లు కనంబడదు. ఒకదాని కొకటి సంబంధము లేదని చెప్పిరి.

చమూపతి యంతటితో నా సభ ముగింపుచు వీరభటులం జూచి నిష్కారణము దొరకిన యపరాధిని విడిచిపెట్టితిరి. పట్టణమంతయు గాలించి రేపు మధ్యాహ్నములోపుగ వానిం బట్టుకొని నా యెదురఁ బెట్టనిచో మిమ్మునందర బందీగృహంబునం బెట్టింతునని పలికి శెట్టిం జంపిన నేరము విచారింతునని వారిం కారాగారము కనిపి తా నింటికిం బోయెను.

ఆర్యభట్టు భార్యతో నింటికిం బోయి తమ్ము విడిచి పెట్టినందులకు భగవంతుని కనేక నమస్కారములం గావించుచు మహిళ గావించిన దుర్ణయము గుఱించి యిరుగు పొరుగువారు వచ్చి వెరగు పడుచుండ వారికిఁ దగు సమాధానము జెప్పి తన భార్య గుణగౌరవము మెచ్చుకొనుచు నా దివసము వెళ్ళించెను.

నాఁడు తిలకయు మహిళతోఁ గూడ జెఱసాల బెట్టఁబడినది. మహిళ సాధారణముగా దినమునకు నత్యంతాప్తులలో సైత మవసరమును బట్టి యొకటి రెండుమాటల కంటె నెక్కువగా నాడునది కాదు ఆ దివసమునఁ దన నిమితమై తిలక నిష్కారణము బద్ధురాలయ్యెనని విచారించుచు మెల్లగా నిట్ల నియె.

యువతీ ! నీ వెవ్వతెవో ధర్మాత్మురాలవుగాఁ గనంబడుచుంటివి. నీ ప్రాయము చిన్నదైనను గుణము పెద్దదిగదా. అయ్యో ! యీ మందభాగ్యురాలి కేమిటి కుపకారము చేయఁబూనితివి. కటకటా : యే పాపమెఱుంగక నా నిమిత్త మూరక శిక్షింపఁబడుచుంటివే అక్కటా ! పాడువిధీ ! నన్నింక నెన్ని చిక్కులు పెట్టి చంపెదవు. అని కన్నీరు మున్నీరుగా విచారించుటయు నూరడింపుచుఁ దిలక యిట్ల నియె.

అమ్మా ! నా నిమిత్తము నీవు విచారింపకము. నే నన్నింటికిం దెగించి యున్న దాన. మొన్న నిన్నుఁ జూచినది మొదలు నీ వృత్తాంతము వినవలయునని యూరక తలంచుచుందు. నీ యజమానురాలి దుష్టచేష్టలన్నియుఁ గన్నులార గంటి. జెవులార వింటి కోమటి వలన లంచముగొని నిన్ను గపటంబున గుడికంపినది. నీవు కడునిల్లాలవు ఏ దోషము నెఱుంగవు. నిన్నుఁగామించిన దుర్మార్గుడు నశింపక నిలుచునా నీవు వీరింటికెట్లు వచ్చితివి. నీ జన్మభూమి యేది. నీ పతి యెవ్వఁడు ? నీ వృత్తాంతము చెప్పుము. మనకు మనమే యోదార్చుకొనవలయు మనల నూరడించువా రెవ్వరున్నారు ? అని యడిగిన విని యక్కలికి మఱియు వెక్కి వెక్కి యేడువఁ దొడంగినది.

అప్పుడు తిలక పెద్దతడవు సానునయముగా నూరడింపుచు అమ్మా ! నా ప్రశ్నమువలన నీకు మఱికొంత విచార మెక్కుడైనట్లున్నది. పోనిమ్ము . మఱి