పుట:కాశీమజిలీకథలు -04.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పోలిశెట్టి కథ

245

జొచ్చిరి. చమూపతి వాడిందున్నప్పుడేమి చేసెనో సవిస్తరముగా వక్కాణింపుడని యడిగిన వైఖానసు డొకండు అయ్యా ! వాఁడీ గుడిలోఁ బ్రవేశించినది మొదలు నేను వెంట వెంటనే తిరుగుచుంటి. గుడి చుట్టు తిరుగుచు నుత్తరము వైపుననున్న గోడమీఁద నేవియో పద్యములు వ్రాసియుండగా విమర్శించి చూచి దాని క్రింద మసిబొగ్గుతోఁ దానేదియో వ్రాసెను. మఱియు నా గోడలన్నియు బరీక్షించుచు దిరిగె, నిదియే వాఁడు చేసినపని యని చెప్పెను. అప్పుడు చమూపతి వాఁడు వ్రాసిన వ్రాత యేదియో చూడవలయునని యా గోడ యొద్దకుఁబోయి చూచెను. అందీ క్రింది పద్యములు మసి బొగ్గుతో వ్రాయబడియున్నవి.

క. విరినవ్వుతావులివియని
   యరుదెంచితినిందదేమియగపడదయ్యన్.
   సరిసరియని యొకతుమ్మెద
   హరినెలపునఁ దిరిగెఁ జిత్రితాబ్దంబులపై.

గీ. లలితపదబంధ మీపద్యకలితభావ
    మరయువారలు నాకాప్తులగుదు రెపుడు

ఇంతవఱకు నొకరు వ్రాసిన పోలికఁ గనంబడుచున్నది.

    తెలిసికొంటిని నెమ్మోము తిలకమనఁగ
    గలిసికావింతు నేస్తంబు గానిపింపు.

పై చరణములు మఱియొకరు పూర్తి జేసినట్లు కనంబడుచున్నది. పుష్పహాసుం డీక్రింది పద్యము పై వానింజూచి వ్రాసెనని చెప్పిరి.

క. మితిమీరెఁగాన నిలుచుట
   యతికష్టముగాన నొరుల కగ్గంబై నన్
   వెతగావునఁ జనియె మదు
   వ్రతమా ! యమరావతిని శుభంబగు తావుల్.

చమూపతి మహమ్మదీయుఁడగుట వాని యర్థమేమియో తెలిసికొనలేక యా మూడు పద్యములు కాగితముపై వ్రాయించి చదురునకుంబోయి పట్టణమంతయు వెదకి వానిం బట్టుకొని రెక్కలు గట్టి తీసికొని రండని కింకరుల కాజ్ఞాపించి యందు నిలువం బడియున్న యార్య భట్టుం జూచి వీనికర్థ మేమియో చెప్పుమని యా కాగిత మాయన చేఁతికిచ్చెను. ఆ విప్రుండు సంస్కృత భాషా పాండిత్యము గలవాఁడయ్యు నందలి భావము గ్రహింపలేక పదిసారులు చదివి చదివి యిది యేదియో సాంకేతికముగా స్త్రీ పురుషులు వ్రాసికొనినట్లు కనంబడుచున్నది. దీని భావము నాకేమియుఁ దెలియలేదని చెప్పి యా కాగితము తిరుగ నిచ్చి వేసెను. అతండు మఱియు నాఁవీటనున్న మేటి పండితులఁ బెక్కండ్ర రప్పించి యా పద్యముల భావమేమని యడిగిన వారు విమర్శించి చూచి తెలియక అయ్యా ! తఱచు మాలో దేవాలయములో గోడల మీఁదను .